విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 14: కార్పొరేటర్ బిపిన్ జైన్ తీరు మారడం లేదు. ఇప్పటికే ఆయన వ్యవహార శైలిపై అధికార వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఆయన్ను ఓ మహిళా ఉద్యోగిని బిపిన్ జైన్ చెంప చెల్లుమనిపించిన ఘటన ఆలస్యంగా బయటపడిరది. 31వ వార్డు వైసీపీ కార్పొరేటర్‌గా బిపిన్ జైన్ ఇక్కడి డ్వాక్రా బజార్ సమీపంలో గురువారం జరిగిన జగనన్న సురక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పొదుపు సంఘాల నేతలు, ఆర్పీలు కూడా హాజరయ్యారు. ఈ సమయంలో మహిళలతో ఆయన అసభ్యంగా ప్రవర్తించడంతో సదరు మహిళ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా బిపిన్ జైన్ చెంప చెల్లుమనిపించారు. దీంతో మీ అంతు చూస్తాను..సీవో (కమ్యూనిటీ అధికారి)తో చెప్పి మీ ఉద్యోగం పీకించేస్తానంటూ బిపిన్ కూడా రెచ్చిపోయారు. దీంతో బాధితురాలి తరఫున సహచర ఉద్యోగులు కూడా తీవ్రంగా ఆవేదన చెంది ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకువెళ్తామంటూ హెచ్చరించారు.
ఇటీవలే మరో సంఘటన
కార్పొరేటర్‌గా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బిపిన్ జైన్ పక్కదారి పట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల జగదాంబ జంక్షన్ ప్రాంతంలో కాలువల్ని శుభ్రం చేయాలంటూ ఆ ప్రాంత మహిళలు కోరారు. అయితే అందుకు ఆయన సరైన సమాధానం చెప్పకుండా రాజస్థాన్‌లో ఎవరి వీధి కాలువలు వారే శుభ్రం చేసుకుంటారని, మీరు కూడా అలాగే చేసుకోండని విసురుగా సమాధానం చెప్పడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇటువైపు వస్తే అదే కాలువలో నిన్ను పడేసి తొక్కేస్తాం అంటూ దూషిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. బిపిన్ జైన్ కూడా పూటకోమాట, రోజుకో రీతిన వ్యవహరిస్తున్నారు. ఏ పార్టీ నేతలొస్తే ఆ పార్టీ వాళ్లతో సెల్ఫీలు దిగడం, వైసీపీలో ఉంటూనే ఇతర పార్టీల సమావేశాలకు హాజరు కావడం కూడా జరుగుతోంది.