ఢిల్లీ, న్యూస్లీడర్, జూలై 14 : భారత అంతరిక్ష సంస్థ ఇస్రో శుక్రవారం అత్యంత ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది. అనుకున్నది అనుకున్నట్టుగా సాగితే.. మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్వీఎం-3 ఎం4 రాకెట్.. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది. దీంతో ప్రధాని మోడీతో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
దీనిపై ప్రధాని మోడీ ట్వీటర్లో స్పందించారు. ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ చంద్రయాన్`3 ప్రయోగంపై అమితాసక్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ‘అంతరిక్ష రంగంలో 2023, జూలై 14 సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గరోజు. చంద్రుడిపైకి చంద్రయాన్-3 ప్రయాణం మెదలవుతుంది. ఈ మిషన్ కోట్లాది మంది భారతీయుల ఆశలను నింగిలోకి మోసుకెళ్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో జాబిల్లి జనావాసంగా మారొచ్చేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రయాన్-1 ప్రయోగం ముందు వరకు చంద్రుడిపై ఉన్న వాతావరణంపై అనేక సందేహాలు, అపోహలు ఉండేవి. చందమామపై ఒక్క చుక్క కూడా నీరు ఉండదని అభిప్రాయ పడేవారు. కానీ తర్వాత ఆ అభిప్రాయం మారింది. ఆ క్రమంలో ఇది భవిష్యత్తులో జనావాసంగా మారొచ్చు అని ప్రధాని ఆకాక్షించారు.
అలాగే తాజా ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. అక్కడి నుంచి ప్రస్తుత ప్రయోగంపై దృష్టి సారించారు.