చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లిలోని ఏఆర్టీ జువెలరీ దుకాణ దారుడు రూ.లక్షకు 12 శాతం వడ్డీ చెల్లిస్తానని నమ్మించి అమాయకులను మోసం చేశాడు. 300 మందిని నుంచి రూ.4 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. గతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి తాజాగా బాధితులు మరికొందరు గురువారం చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వసంతకుమారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్థానిక రామ్నగర్ కాలనీకి చెందిన విజయ్ 2021 అక్టోబరులో ఏఆర్టీ పేరుతో జువెలరీ దుకాణాన్ని నెలకొల్పాడు. చిరు వ్యాపారం చేస్తూ రూ.లక్ష చెల్లిస్తే.. 12 శాతం వడ్డీ ఇస్తానని ప్రజలను నమ్మించి మొదట్లో నగదు చెల్లించిన వారికి వడ్డీ ఇస్తూ వచ్చాడు. అలా 300 మంది నుంచి సుమారు రూ.4 కోట్లు వసూలు చేశాడు. వారికి కొద్దిరోజుల వరకు వడ్డీ చెల్లించి ప్రస్తుతం అదృశ్యమయ్యాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై వసంత కుమారి బాధితుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.