గోపాలపట్నం, న్యూస్‌లీడర్, జూలై 14: మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పంచకర్ల రమేష్‌బాబు అడుగులు ఎటువైపోనంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. జనసేన పార్టీ నుంచి పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారనే ప్రచారం ఊపందుకుంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడి స్థానంలో ఉన్న పంచకర్ల తాను ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసినట్టు గురువారం ప్రచారం జరగడంతో ఈ ప్రచారం మరింతగా జనంలోకి వెళ్లింది. ఆయన అభిమానులు కూడా రమేష్‌బాబు ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచకర్ల రమేష్‌బాబు శుక్రవారం తన అభిమానులతో సమావేశమయ్యారు. మరోవైపు ఆయన గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉంది. దీంతో టీడీపీలోకి వెళ్తారేమోనన్న ప్రచారం కూడా జరుగుతోంది.
మీ అందరి అభిప్రాయమే.. నా అభిప్రాయం
పెందుర్తిలోని ఇంద్రాణి పంక్షన్ హాల్లో పంచకర్ల రమేష్ బాబు తన అభిమానులతో శుక్రవారం ఓ సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్పోరేటర్ కాకి గోవింద రెడ్డి సైతం హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ తనపై అభిమానంతో ఒక్క ఫోన్ కాల్తోనే వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఇక్కడకు రావడం తన పూర్వజన్మ సుకృతమేనన్నారు. ‘మీ అందరికీ చెప్పకుండా విశాఖ వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని, దానికి కారణం ఆ విషయం ముందే తెలిస్తే ఆమోదించరని స్పష్టత ఇచ్చారు. మీ అందరి కోరికపైనే ఏ పార్టీలో చేరాలోనన్నది తెలియజేస్తానన్నారు. తనకు ఎవరిపైనా కోపం లేదన్నారు’. కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచకర్ల అన్న ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా ఆ నిర్ణయానికి కట్టుబడే ఉంటామన్నారు. ప్రాణం పోయేంతవరకూ పంచకర్ల తోనే ఉంటామంటూ నినాదాలు కూడా చేశారు. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు పెందుర్తిలో వేలాది మంది కార్యకర్తలతో సొంత బలముంది. పెందుర్తి నుంచే పోటీ చేయాలనే బలమైన కోరికతో ఉన్నప్పటికీ వైసీపీ నుంచి టిక్కెట్ రాదేమోనని, వచ్చినా గెలవలేమేమోనని చెప్పడంతోనే ఆయన జనసేన పార్టీలో తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైయినట్టు తెలుస్తోంది.
పంచకర్ల కెరీర్ ఇదే..
ప్రజా రాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పంచకర్ల తన 14ఏళ్ల పొలిటికల్ కేరీర్లో నాలుగు పార్టీలు మారారు. 2009లో పీఆర్పీ నుంచి పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైంది. దాంతో పంచకర్ల కాంగ్రెస్ సభ్యుడిగానే 2014 వరకూ అసెంబ్లీలో ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికలకు ముందు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్‌తో కలిసి పంచకర్ల కూడా టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి బరిలో దిగి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 2019 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి రెండో సారి పోటీ చేసినప్పటికీ వైసీపీ హవాతో ఓటమి చెందారు. ఆ సమయంలో విశాఖ రూరల్‌లో ఒక్క స్థానంలో కూడా టీడీపీ గెలవకపోవడంతో పంచకచర్ల ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది నెలల పాటు స్తబ్దుగానే ఉన్న పంచకర్ల ఆగస్టు 29, 2020న సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ కూడా ఆయనకు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. కానీ ప్రస్తుతం ఆయన వైసీపీని వీడారు.
పెందుర్తి నియోజకవర్గం నుంచే..
పెందుర్తి నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని పంచకర్ల కృత నిశ్చయంతో ఉన్నారు. అయితే పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ బరిలో ఉండటంతో పంచకర్లకు టికెట్ దక్కే పరిస్థితి కనబడటం లేదు. అంతేకాకుండా వైసీపీ రీజినల్ కో`ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కూడా అదీప్ రాజ్‌కు మద్దతుగా మాట్లాడడంతో పంచకర్లకు అక్కడి టిక్కెట్‌పై ఆశలు అడుగంటిపోయాయి. అయితే టీడీపీలో పదవులు అనుభవించి, ఆ తర్వాత పార్టీ కష్టకాలంలో బయటకు వెళ్లిన నాయకుల్ని తిరిగి పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదని ఇటీవలే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పంచకర్లకు టీడీపీ నుంచి కూడా తలుపులు మూసుకుపోయాయని తెలుస్తోంది. అందుకే ఆయన జనసేన వైపు దృష్టి సారించారని తెలుస్తోంది. మరోవైపు పెందుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే జనసేన పార్టీ సమన్వయకర్తగా, పార్టీ ప్రధాన కార్యదర్శి టి. శివ శంకరరావు ఉండనే ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని పలువురు జనసేన, టీడీపీ శ్రేణులతో పంచకర్లకు సన్నిహిత సంబంధాలున్నాయి. తాను త్వరలోనే తన నిర్ణయాన్ని తెలియజేస్తానని ఇప్పటికే పంచకర్ల మీడియా ద్వారా తెలియజేశారు. ఆయన ప్రస్థానం ఎటువైపోనన్నది చూడాల్సిందే.