ఢిల్లీ, న్యూస్‌లీడర్, జూలై 14 : ఉధృత వర్షాలతో మహోగ్రరూపం దాల్చి ఢిల్లీని వణికించిన యమునా నది శుక్రవారం ఉదయానికి కొంత శాంతించింది. వరద తాకిడి కాస్త నిలకడగా ఉండడంతో దేశ రాజధాని ఢిల్లీ ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నప్పటికీ భయం మాత్రం వీడిరది. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో నీటి మట్టం 208.46 మీటర్ల వద్ద ఉంది. కాస్త తగ్గినప్పటికీ.. ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే మూడు మీటర్లు ఎక్కువగానే ఉంది.
ఇప్పటికీ మురికి కాలువలు పొంగుతుండటంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్ వేదికగా ప్రజలకు సూచనలు చేశారు. భైరాన్ రోడ్డు, వికాస్ మార్గ్‌లో రాకపోకలను నిలిపివేసినట్లు వెల్లడిరచారు. యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు
విద్యాసంస్థలకు సెలవు
ఢిల్లీలో వరదనీటి ప్రభావం కొనసాగుతుండటంతో విద్యాసంస్థలను జులై 16 వరకు మూసివేశారు. ఎర్రకోట సందర్శననూ నిలిపివేశారు. అలాగే సుప్రీంకోర్టు, రాజ్‌ఘాట్ సమీపంలోకి వరద నీరు చేరింది. నిత్యావసరాలు మినహా భారీగా సరకు తరలించే వాహనాల రాకపై అధికారులు ఆంక్షలు విధించారు. ఢిల్లీీ ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ రెగ్యులేటర్ దెబ్బతినడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. దీనివల్ల యమునా నది నీళ్లు తిరిగి నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దృష్టి సారించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
ప్రధాని ఆరా
దేశ రాజధానిలో నెలకొని ఉన్న పరిస్థితులపై ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఆరా తీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ఇంకా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద తగ్గుముఖం పడుతుండడంతో ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేయాలని సూచించారు. ముఖ్యంగా.. మురికి వాడలు, పేదలు నివసించే ప్రాంతాల్లో ఆహారం, నీరు వంటి అత్యవసరాలు అందించాలని ఆదేశించారు.
ఇక ఢిల్లీలో శుక్రవారం తేలికపాటి వర్షాలు పడతాయని, శనివారానికి ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావారణ శాఖ వెల్లడిరచింది.