మాస్కో : రష్యా నాయకత్వంపై ఇటీవల వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు చేయడం యావత్ప్రపంచానికి తెలుసు. అయితే తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు తమ దేశంలో వాగ్నర్ గ్రూపు అనేది అధికారికంగా లేదని చెప్పుకొస్తున్నారు. ఆయన రష్యా పత్రిక ‘కొమ్మర్సంట్’తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యాలో తిరుగుబాటు జరిగిన ఐదు రోజుల తర్వాత జూన్ 29న క్రెమ్లిన్‌లో జరిగిన కీలక సమావేశంలో వాగ్నర్ బాస్ ప్రిగోజిన్ సహా 35 మంది కమాండర్లు పాల్గొన్నారు. ఆ సమావేశ వివరాలను వెల్లడిస్తూ ఈ విషయాన్ని పుతిన్ చెప్పారు. పుతిన్ ‘కొమ్మర్సంట్’తో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో మూడు అంశాలపై చర్చించామని తెలిపారు. ఆ వివరాలను ఆయన వెల్లడిస్తూప.. వీటిల్లో మొదటిది.. ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో వారు ఎలా పోరాడారన్నది. రెండోది.. జూన్ 24 ఘటనల్లో వారు ఏం చేశారన్నది. ఇక చివరిది.. భవిష్యత్తులో వారి సేవలకు సంబంధించినది అని చెప్పారు. దీనిలో వారి యుద్ధ అనుభవాన్ని వాడుకొనే అంశం కూడా ఉందని తెలిపారు.
వాగ్నర్ పీఎంసీ ఓ యూనిట్‌గా ఉంటుందా? అని కొమ్మర్సంట్ ప్రతినిధి ప్రశ్నించగా.. వాగ్నర్ పీఎంసీ అనేది లేదు అని పుతిన్ చెప్పారు. మా దేశ చట్టాలు ప్రైవేటు సైన్యాలకు అనుమతి ఇవ్వవు. వాస్తవానికి వాగ్నర్ గ్రూపు ఉంది. కానీ, చట్టం దృష్టిలో మాత్రం అటువంటి సంస్థ అనేది లేదు. దీన్ని చట్టపరం చేయడం ఓ ప్రత్యేకమైన విషయం. ఆ విషయాన్ని స్టేట్ డూమా చర్చించాల్సి ఉంటుంది అని పుతిన్ పేర్కొన్నారు.
కాగా, 35 మంది వాగ్నర్ కమాండర్లకు పలు ఉపాధి ఆఫర్లు ఇచ్చినట్లు పుతిన్ వివరించారు. వీటిల్లో సెడోయ్ (గ్రేహెయిర్) అనే కాల్‌సైన్‌తో పిలిచే కమాండర్ కింద నేరుగా పని చేయడం కూడా ఒకటని తెలిపారు. ఇతడి కిందే గత 16 నెలలుగా వాగ్నర్ బృందాలు పోరాడుతున్నాయని చెప్పారు. వారందరూ కలిసి ఒకే చోటకు చేరి సేవలు అందించనున్నట్టు చెప్పారు. వారికి పరిస్థితులు గతంలో ఎలా ఉన్నాయో.. అలానే కొనసాగుతాయి. ఎటువంటి మార్పు ఉండదు. వారి నిజమైన కమాండరే నాయకత్వం వహిస్తారని పుతిన్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న ‘వాగ్నర్ గ్రూపు’.. గత నెల 24న తిరుగుబాటు ప్రయత్నంలో భాగంగా రొస్తోవ్-ఆన్-డాన్ నగరంలోని రష్యా సైనిక కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకున్నది. మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో చివరకు వెనక్కి తగ్గిన వాగ్నర్ చీఫ్.. రక్తపాతం లేకుండా చేయడానికి తమ దళాలను వెనక్కు తీసుకునేందుకు అంగీకరించినట్లు ప్రకటించడంతో తిరుగుబాటు యత్నానికి బ్రేక్ పడినట్లయ్యింది.