కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యుత్తు పనులు చేసేందుకు వచ్చిన ఓ ఎలక్ట్రీషియన్ విద్యార్థినులకు కరెంటు షాక్ ఇచ్చాడు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో తరగతి గదుల్లో టీవీలు అమర్చేందుకు ప్రధానోపాధ్యాయిని పద్మావతిభాయ్ కంకిపాడుకు చెందిన ఓ ఎలక్ట్రీషియన్‌ను పిలిపించారు.
అతను తనవెంట సూరిబాబు అనే వ్యక్తిని సహాయకుడిగా తీసుకొచ్చాడు. గురువారం పదో తరగతి బీ సెక్షన్లో సూరిబాబు పనిచేస్తూ విద్యార్థినులతో మాటలు కలిపాడు. విద్యుత్తు తీగలను వారు కూర్చున్న బెంచికి తాకించాడు. పలుమార్లు ఇలానే చేశాడు. షాక్‌కు గురైన ముగ్గురు విద్యార్థినులు ముఖం కడుక్కునేందుకు వచ్చారు. నీరసంతో ఓ విద్యార్థిని పడిపోయింది. విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయిని, సిబ్బంది వారిని ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స అందించి, ఇళ్లకు పంపారు.
సాయంత్రం విద్యార్థినులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మండల అధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం అధికారులు, ప్రజాప్రతినిధులు పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాయినిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని పాఠశాలకు పిలిపించి నిలయదీయటంతో సరదాగా ఈ పని చేశానన్నాడు. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.