ఢిల్లీ, న్యూస్ లీడర్, జూలై 11 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్’ను నిలుపుదల చేస్తూ (స్టే) ఉత్తర్వులిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఈ కేసుపై తన వైఖరేమిటో తెలపాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ పిటిషన్‌ను సవరించి లెఫ్టినెంట్ గవర్నర్‌నూ ప్రతివాదిగా చేర్చాలని దిల్లీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఫ్వీుని ఆదేశించింది. ‘ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్’ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణకు చేపట్టింది. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకమైనదే కాకుండా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనూ ధిక్కరించేలా ఉందని, దానిని రద్దు చేయడంతోపాటు మధ్యంతర నిలుపుదల ఉత్తర్వులివ్వాలని కేజ్రీవాల్ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. అయితే, 437 మంది స్వతంత్ర సలహాదారులను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయంపై ఈ నెల 17న విచారణ జరుపుతామని తెలిపింది. దేశ రాజధాని దిల్లీలో ఐఏఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై స్థానిక ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని సుప్రీంకోర్టు మే 11న దిల్లీ సర్కారుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే, ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ కేంద్రం మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది.
సిసోదియా బెయిల్ పిటిషన్‌పై 14న విచారణ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 14న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సిసోదియా భార్య తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో ఉన్నారని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఫ్వీు సోమవారం సుప్రీంకు తెలియజేశారు.
సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ 24 వరకు పొడిగింపు
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు వైద్యపరమైన కారణాలతో మంజూరైన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 24 వరకు పొడిగించింది. జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్‌ల ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన జైన్‌కు మే 26న మధ్యంతర బెయిల్ మంజూరైంది.
రూ.2వేల నోట్లపై పిల్ కొట్టివేత
గుర్తింపు పత్రాలు లేకుండా రూ.2 వేల నోట్ల మార్పిడిని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అది విధానపరమైన కార్యనిర్వాహక నిర్ణయమని స్పష్టం చేసింది. న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. మే 29వ తేదీన ఈ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. దానిని సవాలు చేస్తూ పిటిషనరు సుప్రీంను ఆశ్రయించాం.
31న ఉద్ధవ్ పిటిషన్‌పై విచారణ
పార్టీ పేరు, గుర్తును ఏక్నాథ్ శిందే వర్గానికి ఎన్నికల సంఘం (ఈసీ) కేటాయించడాన్ని సవాలు చేస్తూ శివసేన (ఉద్ధవ్) దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 31వ తేదీన సుప్రీంకోర్టు విచారించనుంది. న్యాయవాది అమిత్ తివారీ అభ్యర్థన మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన ధర్మాసనం సోమవారం కేసు విచారణ తేదీని నిర్ణయించింది. శిందే వర్గం ఇచ్చిన సమాధానంపై రీజాయిండర్కు ఉద్ధవ్ వర్గానికి అవకాశమిచ్చింది.