అమరావతి, న్యూస్‌లీడర్, జూలై 15 : ఆంధ్రప్రదేశ్‌లో యథేచ్ఛగా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయని, దీని నియంత్రణ కోసం ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫిర్యాదు చేశారు. శనివారం గవర్నర్‌ను లోకేశ్ కలిశారు. డ్రగ్స్ లభ్యతలో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిపే డీఆర్ఐ నివేదిక ప్రతులను గవర్నర్‌కు అందించారు. దేశంలో అన్ని ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి సరఫరా అవుతుందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు డ్రగ్స్ సరఫరా కేంద్రంగా రాష్ట్రం మారుతోందంటూ ఫిర్యాదు చేశారు. మరోవైపు హవాలా లావాదేవీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ కోరారు. లోకేశ్‌తో పాటు గవర్నర్ వద్దకు వెళ్లిన వారిలో టీడీపీ నేతలు షరీఫ్, నక్కా ఆనంద్‌బాబు, కొల్లు రవీంద్ర ఉన్నారు.
గవర్నర్‌ను కలిసిన అనంతరం లోకేశ్ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అండదండలు, వైసీపీ నేతల ప్రమేయంతోనే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతోందని ఆరోపించారు. డ్రగ్స్ ఉత్పత్తి, స్మగ్లింగ్‌లో పట్టుబడిన వారిలో వైసీపీ నేతలే అధికంగా ఉండడం దీనికి నిదర్శనమన్నారు. గత నాలుగేళ్లలో యువత మత్తులో దాడులు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయని.. విద్యార్థులపైనా ఈ మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు.
గవర్నర్‌ను కలిసిన అనంతరం లోకేశ్ యువగళం పాదయాత్రకు బయలుదేరి వెళ్లారు. శనివారం యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది.