విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 15: జీవీఎంసీలో ఈ నెల 19న నిర్వహించనున్న స్థాయీ సంఘం ఎన్నికల్లో ఈసారి కూడా విజయం సాధించేందుకు వైసీపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నగరంలోని శనివారం ఓ హోటల్లో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ బాధ్యులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల సందడి ముగిసింది. అధికార పార్టీ తరఫున 10మంది కార్పొరేటర్లు బరిలో ఉన్నారు. ప్రతిపక్ష టీడీపీకి ఎవరూ మద్దతు తెలియజేయకుండా ఉండేందుకు ఇప్పటికే విప్ కూడా జారీ చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో మాక్ పోలింగ్ నిర్వహించి సభ్యుల్లో కూడా అవగాహన కల్పించాలంటూ వైవీ సూచించారు. అంతేకాకుండా పార్టీ, ప్రజలకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావన కూడా వచ్చిందంటున్నారు. ఈ సమావేశానికి ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు గాజువాక, పెందుర్తి ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, వరుదు కల్యాణి, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, సుమారు 50మంది కార్పొరేటర్లు కూడా హాజరయ్చారు. అయితే మీడియాను అనుమతించకుపోవడం గమనార్హం.