ఫ్రాన్స్, న్యూస్ లీడర్, జూలై 15 భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడి ఆహ్వానంతో ఆ దేశంలో రెండు రోజుల పర్యటన జయప్రదంగా సాగింది. ఈ టూర్‌కు సంబంధించిన వీడియోను ప్రధాని ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల దృశ్యాలతో మొదలైన వీడియో.. ఈఫిల్ టవర్ వద్ద ముగుస్తుంది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బాస్టిల్ డే పరేడ్ దృశ్యాలతోపాటు మోడీ పాల్గొన్న కార్యక్రమాల గ్లింప్స్ కూడా వీడియోలో చూడొచ్చు. శుక్రవారం పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో మోడీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందు, మ్యూజియంలోకి ప్రధాని మోడీని స్వాగతిస్తున్న ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రాన్లను కూడా చూడొచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియంలో ఏర్పాటు చేసిన విందు స్వీకరించిన తర్వాత మ్యూజియంలోని ఐకానిక్ వర్క్‌లను మోడీ ప్రత్యేకంగా వీక్షించడం కనిపిస్తోంది. ఈ మ్యూజియంలో చివరిసారిగా 1953లో క్వీన్ ఎలిజబెత్ కోసం విందు జరిగింది. మళ్లీ ఇప్పుడు ప్రధాని మోడీ కోసం ఈ మ్యూజియంలో విందు ఏర్పాటు చేశారు.