ఢిల్లీ,న్యూస్ లీడర్, జూలై 15 దేశ రాజధాని నగరం ఢిల్లీ శనివారానికి కాస్తా ఊపిరిపీల్చుకుంటోంది. ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్న యమునా నది నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతుండటమే అందుకు కారణం. అయితే నగర వాసులు మాత్రం పూర్తిగా జలదిగ్బంధం నుంచి బయటపడలేదు. ఐటీఓ, శాంతి వాన్ ఏరియా, ఇన్కం ట్యాక్స్ ఆఫీస్ సమీపంలో, ఇంకా పలు కీలక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచే ఉన్నాయి. శనివారం ఉదయానికి యమునా నదిలో నీటి మట్టం 207 మీటర్ల సమీపంలో ఉంది. ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే రెండు మీటర్ల ఎగువనే ఉన్నప్పటికీ.. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది. అయితే ఇంకా వరద నుంచి బయటపడని ఢిల్లీ నగరానికి శనివారం రోజుకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. రానున్న 3-4 రోజులు ఢిల్లీ వ్యాప్తంగా మోస్తారు వర్షాలు పడతాయని అంచనా వేసింది.
ఇక రాజకీయ బురద…
వరద తగ్గడంతో ఇక భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య రాజకీయ విమర్శలకు దారితీశాయి. ‘వరద వచ్చినప్పుడు ఉత్తర్ప్రదేశ్, ఢిల్లీ, హరియాణా వైపు సమాన స్థాయిలో హత్నికుండ్ నుంచి నీటిని విడుదల చేయాలి. కానీ జులై 9 నుంచి 13న ఢిల్లీ వైపు మాత్రమే నీటిని విడుదల చేశారు. సమానస్థాయిలో నీటిని విడుదల చేసి ఉంటే.. యమున సమీప ప్రాంతాలు సురక్షితంగా ఉండేవి. దేశంలోని ఐదు రాష్ట్రాలు ఈ వర్షాకాలంలో ప్రభావితమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, ఢిల్లీ ఆ జాబితాలో ఉన్నాయి. కానీ ఢిల్లీలో వర్షాలు లేవు. అయినా సరే ఎందుకు యమునలో నీటిమట్టం పెరిగి, నగరంలోని ప్రాంతాలను ముంచెత్తింది. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతోంది’ అని ఆప్ తీవ్ర విమర్శలు గుప్పించింది.
పీఆర్ స్పందన…
దీనిపై డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ట్విటర్ వేదికగా స్పందించింది. కేంద్ర జల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం.. లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని పశ్చిమ యమున, తూర్పు యమున కాలువల్లోకి వదలామని తెలిపింది. అలా వదిలితే బ్యారేజ్ నిర్మాణం దెబ్బతినే అవకాశం ఉందని వెల్లడిరచింది. ‘ఆ కాలువల్లోకి నీటిని విడుదల చేయకపోవడం వల్లే ఢిల్లీలో వరదలు సంభవించాయని విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ మార్గదర్శకాల ప్రకారమే అంతా జరిగింది. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోంది’ అని ట్విటర్ వేదికగా విమర్శలను తోసిపుచ్చింది.