ముంబాయి, న్యూస్ లీడర్, జూలై 15 కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 2022 జూన్‌లో భాజపాతో జట్టు కట్టిన శివసేన ఎమ్మెల్యేలు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందేపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన కేసులో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. వారి అనర్హతపై సత్వరమే నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని శివసేన (ఉద్ధవ్ బాల్‌ఠాక్రే) ఎమ్మెల్యే సునీల్ ప్రభు ఈ పిటిషన్ వేశారు. శివసేనలో చీలిక రాకముందు 2022లో సునీల్ ప్రభు ఆ పార్టీ చీఫ్‌విప్‌గా ఉన్నారు. రెండు వారాల్లో సమాధానమివ్వాలని ఆదేశిస్తూ స్పీకర్‌కు నోటీసు జారీ చేస్తున్నట్టు సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్ర ధర్మాసనం తెలిపింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై సహేతుకమైన సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని మే 11న సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నప్పటికీ మహారాష్ట్ర సభాపతి రాహుల్ నర్వేకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు.
సిసోదియా పిటిషన్‌పై స్పందన తెలపండి
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత, ఢల్లీి మాజీ డిప్యూటీ సీఎం సిసోదియా దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై స్పందన తెలపాలని సీబీఐ, ఈడీలను సుప్రీం కోరింది. ఈ నెల 28 కల్లా అభ్యంతరాలను సమర్పించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. సిసోదియా భార్య తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నందున ఆయనకు మధ్యంతర బెయిల్ కోరుతూ న్యాయవాది అభిషేక్ సింఘ్వి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారణకు చేపట్టింది.
అరెస్టు నుంచి 17 వరకు మహిళా న్యాయవాదికి రక్షణ
హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న మణిపుర్లో నిజనిర్ధారణ కమిటీ నివేదిక పేరుతో ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా న్యాయవాదికి కల్పించిన రక్షణను సుప్రీంకోర్టు సోమవారం వరకు పొడిగించింది. ఆమెపై ఈ నెల 17వ తేదీ వరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ మనోశ్ మిశ్రల ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. మహిళా న్యాయవాది దీక్షా ద్వివేదిని మణిపుర్ పోలీసులు అరెస్టు చేయకుండా తొలుత ఈ నెల 14వ తేదీ (శుక్రవారం) సాయంత్రం 5 గంటల వరకు రక్షణ కల్పించింది. శుక్రవారం ఈ కేసు విచారణకు మణిపుర్ రాష్ట్రం తరఫున హాజరుకావాల్సిన సొలిసిటర్ జనరల్ రాలేకపోవడంతో ఈ నెల 17వ తేదీకి వాయిదా పడిరది. ఆ రోజు వరకూ మహిళా న్యాయవాదిని అరెస్టు చేయవద్దని ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది.