విశాఖపట్నం న్యూస్‌లీడర్, జూలై 15: బెజవాడ సమీపంలోని ఉయ్యూరులో ఉన్న ఓ స్థలాన్ని తమకు అప్పగించకపోతే చంపేస్తామంటూ అక్కడి టీడీపీ నేత ఒకరు విశాఖ వాసిపై దౌర్జన్యానికి దిగారు. ఆ స్థలాన్ని ఆనుకుని జాతీయ రహదారి వేస్తుండడంతో దానికి ప్రాముఖ్యం ఏర్పడిరది. దీంతో ముగ్గురు వ్యక్తులు తన వద్దకు వచ్చి తనపైనా, తన భార్య పట్ల దుర్భాషలాడి, దౌర్జన్యానికి దిగి, స్థలం ఇచ్చేయాలని, లేదంటే చంపేస్తామని బెదిరించినట్టు బాధితుడు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై 341, 323, 506రెడ్‌విత్ 34ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని విశాలాక్షీనగర్లో ఉంటున్న న్యాయపతి రాంజీ ఇక్కడి ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు ఉయ్యూరు`పమిడిముక్కల ప్రాంతంలో 192గజాల స్థలం ఉంది. 2016లో ఆ స్థలాన్ని ఎలమంచిలి శ్రీధర్, భార్య అరుణకుమారి నుంచి రాంజీ కొనుగోలు చేశారు. అయితే భూముల ధరలకు రెక్కలు వస్తుండడం, ఆక్రమణలకు గురవుతుండడంతో తన స్థలాన్ని మరోమారు సర్వే చేయించాలని గతేడాది రాంజీ అక్కడి తహసీల్దార్‌ను కోరారు. దీంతో ఈ స్థలాన్ని రాంజీకి విక్రయించిన వారే దానిపై మళ్లీ కన్నేశారన్నది అభియోగం. ఇదిలా ఉంటే గత నెల 5న యలమంచిలి శ్రీధర్, ప్రసాద్‌రెడ్డితో పాటు మరో వ్యక్తి విశాఖలోని రాంజీ పని చేస్తున్న కార్యాలయం వద్దకు వచ్చి ఉయ్యూరులోని స్థలం ఇచ్చేయాలని అడిగారు. తాను విక్రయించేది లేదని రాంజీ తెగేసి చెప్పడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. తమ మాట వినకపోతే భార్య, భర్తల్ని చంపేస్తామని రాంజీని హెచ్చరించారు. వచ్చిన వారు రాంజీ చేతిని నలిపేశారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ రాంజీ ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులు టీడీపీలో క్రీయాశీలకంగా ఉంటున్నారని ప్రాథమికంగా గుర్తించారు.