విశాఖపట్నం, న్యూస్ లీడర్, జూలై 18: సామాన్యుల కోసం వందే సాధారణ్ రైళ్లు రాబోతున్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ మాల్యా.. వీటిని అక్టోబరులో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అయితే వీటికి వందే సాధారణ్ అనే పేరు ఉంటుందా లేదంటే అంత్యోదయ అనే పేరు పెడతారా? అనే విషయంపై స్పష్టత లేదు. నాన్ ఏసీ రైలైన వందే సాధారణ్కు 22 కోచ్‌లుంటాయి. రెండువైపులా ఇంజన్లుంటాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. 130 కిలోమీటర్లకన్నా వేగం మించితే శబ్దం ఎక్కువగా వస్తుందని, దుమ్ము రేగుతుందని, అప్పుడు కిటికీలకు షీల్డ్ అమర్చాలని మాల్యా తెలిపారు. అందుకే ఇవి గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగం వరకే వెళతాయన్నారు. ఎక్కువ దూరాన్ని సాధ్యమైనంత తక్కువ సమయంలో చేరుకునేందుకు భారతీయ రైల్వే సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 25 మార్గాల్లో ఇవి నడుస్తున్నాయి. త్వరలోనే మరికొన్ని మార్గాల్లో వందే భారత్ అందుబాటులోకి రానుంది. ఈ తరహా రైళ్లు పరుగులో విజయం సాధించడంతో వీటిల్లోనే మరికొన్ని వేరియంట్స్ తీసుకురావడానికి రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వందే భారత్ స్లీపర్, వందే మెట్రో, వందే సాధారణ రైళ్లు ప్రవేశించబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లు 550 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తున్నాయి. ఇవి ఓన్లీ సిట్టింగ్ మాత్రమే. పడుకోవడానికి అవకాశం లేదు. 550 కిలోమీటర్ల పైబడిన దూరాన్ని కవర్ చేసేందుకు వందే భారత్ స్లీపర్ రైళ్లు వస్తున్నాయి. వందే మెట్రో 100 నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో సేవలందిస్తుంది. ప్రతిరోజు ఐదు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లన్నీ ఏసీ బోగీలతో ఉంటాయి. ఛార్జీలు కూడా ఎక్కువ.