కశ్మీర్, న్యూస్ లీడర్, జూలై 18 : జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌లో భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను భారత భద్రత బలగాలు మట్టుబెట్టాయి. పూంచ్‌లోని సింధారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు సైన్యం, పోలీసులు సోమవారం రాత్రి సూరంకోట్ బెల్ట్‌లోని సింధారా టాప్ ఏరియాలో జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఇది భద్రత బలగాలకు, ఉగ్రవాదుల మధ్య కాల్పులకు దారితీసింది. సోమవారం రాత్రి 11:30 గంటలకు భద్రతా బలగాల మధ్య తొలుత కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత డ్రోన్లతో పాటు ఇతర రాత్రి నిఘా పరికరాలను భద్రత బలగాలు మోహరించాయి. అయితే మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు, కాల్పులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.
తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరగడంతో మళ్లీ ఎన్కౌంటర్ ప్రారంభమైంది. భారత సైన్యం ప్రత్యేక దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసు దళాలతో పాటు ఇతర దళాలు ఈ ఆపరేషన్‌లో భాగంగా ఉన్నాయి. ఈ ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదులు విదేశీ ఉగ్రవాదులే. వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం అని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. ఇంకా ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా పేర్కొంది.