హైదరాబాద్, న్యూస్ లీడర్, జూలై 18 : రాష్ట్రవ్యాప్తంగా మంగళ, బుధవారం అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఇవి ఇంకా పెరిగి గురు, శుక్రవారాల్లోనూ భారీగా కొనసాగనున్నాయని వెల్లడిరచింది. బుధవారంలోగా బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంపై గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఝార్ఖండ్ దక్షిణ ప్రాంతంపై 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
కాగా, సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా మెండోరా (నిజామాబాద్ జిల్లా)లో 1.9, భైంసా (నిర్మల్)లో 1.2, గోధూరు (జగిత్యాల)లో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ముసురు వేసి చిరుజల్లులు కురిశాయి. ఏపీలో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది.