విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మంచానికి పరిమితమైన భర్త ఆలనాపాలనా చూసుకోవాల్సిన భార్య, తనను.. పిల్లలను వదిలేసి రెండో పెళ్లి చేసుకొని తనను మోసగించిందని గుంటూరు బారాఇమామ్పంజాకు చెందిన అబ్దుల్ రజాక్ వాపోయారు. కొవిడ్ ఫైటర్స్‌కు చెందిన అంబులెన్స్‌లో నారి సమ్మాన్ ఛైల్డు వెల్ఫేర్ స్వచ్ఛంద సంస్థ సభ్యుల సహకారంతో బాధితుడు తన పిల్లలతో కలిసి గుంటూరులో స్పందనకు వచ్చి ఫిర్యాదు చేసిన తీరు అందరినీ కలచివేసింది. డీఎస్పీ శ్రీనివాసరావు అంబులెన్స్ వద్దకు వచ్చి ఫిర్యాదు స్వీకరించి అతనికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
బాధితుడు వెల్లడించిన వివరాల ప్రకారం… ‘నేను ఎలక్ట్రీషియన్ని. 16 ఏళ్ల కిందట ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మహిళతో వివాహమైంది. మాకు నలుగురు పిల్లలు. పదో తరగతి చదివిన భార్యను వివాహం అనంతరం ఉన్నత విద్య చదివించాను. కుటుంబ పోషణ కోసం 2019లో సౌదీకి వెళ్లాను. అక్కడ నుంచి భార్యకు డబ్బులు పంపిస్తుండేవాడిని. సౌదీలో పని చేస్తున్న క్రమంలో 2020లో ప్రమాదానికి గురై నా వెన్నెముక విరిగింది. 2021లో గుంటూరు వచ్చాను. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి. వైద్యం, మందుబిళ్లల ఖర్చులకు నగదు లేక ఇబ్బంది పడ్డాం. నా భార్య నా ఫొటోలను వాట్సప్, ఇతర గ్రూపుల్లో పెట్టి డబ్బులు వసూలు చేసుకొని సొంతానికి వాడుకుంది. అయినా నేను బాధ పడలేదు.
నా సోదరులు నన్ను ఆదుకున్నారు. నా భార్య గుంటూరులోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న క్రమంలో ఒకరితో ఫేస్బుక్లో పరిచయమైనట్లు తెలిసింది. నాలుగు నెలల కిందట నన్ను, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. విచారిస్తే.. భార్య చనిపోయిన కడప జిల్లా బద్వేల్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. నన్ను ఇలా మంచంలో వదిలేసి పెళ్లి చేసుకోవడం న్యాయమా? ఇలా మరొకరికి జరగకుండా ఉండాలని లాలాపేట పోలీసులకు 20 రోజుల కిందట ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న నా భార్యను, ఆమెను వివాహమాడిన వ్యక్తి, వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయటానికి వచ్చా’ అని వివరించారు.