పెళ్లయి పట్టుమని నాలుగు నెలలు కాలేదు. అంతలోనే ఆ జంటను చిన్నచూపు చూసింది. అత్తారింట్లో ఉన్న భార్యను కలిసి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న యువకుడిని లారీ రూపంలో మృత్యువు బలితీసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పెదగెద్దాడ గ్రామ శివారులో లారీ ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో దేవీపట్నం మండలం మంటూరుకు చెందిన కొండ్ల అచ్యుతరామిరెడ్డి (25) అక్కడికక్కడే మృతి చెందగా.. పెదగెద్దాడ పంచాయతీ పెదపాడు గ్రామానికి చెందిన ఎర్రగొండ రాజారావు, కత్తుల రవితేజరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అచ్యుతరామిరెడ్డి తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. మారేడుమిల్లి మండలం రామన్నవలస గ్రామానికి చెందిన బేబితో నాలుగు నెలల క్రితం ఆయనకు వివాహమైంది. ఆదివారం రామన్నవలసలోని అత్తారింటికి వెళ్లారు. సోమవారం సాయంత్రం బైక్‌పై తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వైపు వెళ్తుండగా పెదగెద్దాడ వద్ద కోల్‌కతాకు చెందిన లారీ ఆయనను ఢీకొంది. దీంతో అచ్యుతరామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఈయన బైక్ వెనుకనే మరో ద్విచక్ర వాహనంపై పెదపాడుకు చెందిన రాజారావు, రవితేజరెడ్డి స్వగ్రామానికి వెళ్తున్నారు.
అదే లారీ వీరినీ ఢీకొట్టి ఆగకుండా దూసుకెళ్లింది. దీంతో వీరిద్దరికీ కాళ్లు, చేతులు విరిగిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానికులు ఆటోలో రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారవుతుండగా సున్నంపాడు వద్ద పోలీసులు లారీతోపాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న అచ్యుతరామిరెడ్డి బంధువులు ఆసుపత్రికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్సై మోహన్‌కుమార్ తెలిపారు.