హైదరాబాద్, న్యూస్ లీడర్, జూలై 18 తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు రెండో వారంలో జరిగే అవకాశాలున్నాయి. తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల నగారా మోగనున్న నేపధ్యంలో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో కొత్త బిల్లులను ప్రవేశ పెట్టకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న చట్టాలను సవరించడానికి సవరణ బిల్లులను ప్రవేశపెట్టడం పైన దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి అసెంబ్లీని సమావేశపరచాలని రాజ్యాంగ నిబంధనను అనుసరిస్తూ తెలంగాణాలో శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాలలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించనుంది. మొదట ఈ శాసనసభ సమావేశాలలో నూతన క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ, ప్రస్తుతానికి దానిని పక్కనపెట్టి సాంఘిక సంక్షేమం, అటవీ, పురపాలక, విద్యా శాఖలకు సంబంధించిన చట్టాల సవరణపై ప్రధానంగా దృష్టి సారించనున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్కు, ప్రభుత్వానికి ప్రభుత్వ బిల్లుల ఆమోదంపై విభేదాలు తలెత్తిన నేపథ్యంలో కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి బదులుగా ఇప్పటికే ఉన్న చట్టాలను సవరించడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. గత ఏడాదికాలంగా ప్రభుత్వం ప్రతిపాదించిన అనేక బిల్లులపై గవర్నర్ తమిళి సై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేంద్రంలో విపక్షాల భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై వ్యూహం.. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో నియామకాలకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లు, మునిసిపల్ చట్టాల సవరణ బిల్లు, మెడికల్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచే బిల్లు కూడా గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసిన బిల్లులలో ఉన్నాయి. దీంతో కొత్త బిల్లులను ప్రవేశపెట్టే బదులు సవరణల పైన దృష్టి సారించినట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు ముందు జరుగుతున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు కీలక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇవి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి, అనేక చర్చలకు వేదిక కానున్నాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు ఎలా ఉంటాయి అన్నది మాత్రం ఆసక్తికరమే.