విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 18: జనసేనాని పవన్ కల్యాణ్ భావాలు, సమాజ సేవ నచ్చే తాను ఈ నెల 20న జనసేన పార్టీలో చేరుతున్నానని మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. అధికారంలో లేకపోయినా ఆయన సొంత డబ్బుతో రైతుల్ని, పేదల్ని ఆదుకోవడం నచ్చిందన్నారు. రాజకీయంగా ఎక్కడా లబ్ధి పొందకపోయినా ఆయన మాత్రం ప్రజల కోసమే పని చేస్తున్నారన్నారు. గురువారం ఉదయం 6గంటలకు విశాఖ నుంచి 200కార్లు, 25బస్సుల్లో కార్యకర్తలతో కలిసి తాను బెజవాడలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్తానని, 4గంటలకు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకుంటున్నట్టు పంచకర్ల పేర్కొన్నారు. మంగళవారం ఆయన విశాఖలోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల తాను ఓ పార్టీలో జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించానని, ఆ తర్వాత తన అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించానని, వారి సలహాలు, సూచనలతో రెండ్రోజుల క్రితం పవన్ కల్యాణ్‌ను కలిశానని, పార్టీలో చేరుతానని చెప్పి ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని హామీ ఇచ్చి, మీడియాకు వివరాలు చెప్పి బయటకు వచ్చానన్నారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసమే మాట్లాడాలని, ఇప్పటి నుంచి తాను ఏం మాట్లాడినా జనసేన తరఫునే మాట్లాడుతున్నట్టు చెప్పారు. జనసేన బలోపేతం కోసం శతశాతం కృషి చేస్తానని, ఏ పార్టీలో ఉన్నా తనది అందర్నీ విమర్శించే తత్వం కాదని, పార్టీ కోసం పని చేసే తత్వమేనన్నారు.
అధికార పార్టీలో చేరితే అధికారం కోసమే అంటారు..
మీరు జనసేన పార్టీలోనే ఎందుకు చేరాలనుకున్నారు..అక్కడ మీకేదైనా హామీ లభించిందా..పెందుర్తి నుంచే పోటీ చేస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు పంచకర్ల ఓపిగ్గా సమాధానాలిచ్చారు. అధికార పార్టీలో చేరితో అధికారం కోసమే అనుకుంటారని, ప్రజలకు సేవ చేసేదిగా ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీయే తనకు కావాలనుకున్నానని, అందుకే తాను జనసేనలో చేరుతున్నట్టు తెలిపారు. ఎక్కడ పోటీ చేస్తానన్నది ముఖ్యం కాదని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా తాను కష్టపడి పని చేస్తానన్నారు. ఏ పార్టీలో అయినా కార్యకర్తలే ముఖ్యమని, ఎన్నికల సమయంలో 20రోజుల పాటు ప్రచారం చేసేస్తే కాదని, నిత్యం ఊరూరా తిరిగి ప్రచారం చేసే కార్యకర్తలు, నేతలే పార్టీకి ముఖ్యం అని, వారు నిరాశ, నిస్పృహలతో ఉండకూదని, అందుకే తాను కార్యకర్తలతోనే నిత్యం ఉంటానని పేర్కొన్నారు. ఒక సీనియర్ నేతగా తాను పని చేస్తానని, ఎలా కావలిస్తే, అక్కడ తన సేవల్ని వాడుకోవచ్చని పవన్‌ను అడిగానని, అందుకు తాను అంగీకరించారని గుర్తు చేశారు. తాను ఏ పార్టీలో పని చేసినా బాధ్యతగానే చేశానని, ఓ పార్టీలో ఏడాదిగా జిల్లా అధ్యక్ష పదవి కూడా అలాగే చేశానన్నారు. తాను ఎవర్నీ ఎప్పుడూ విమర్శించనని, తన పని తాను చేసుకుపోతానన్నారు. రాజకీయంగా తాను మరో కొత్త జీవితం ప్రారంభించపోతున్నానని, ఎప్పటిలాగే అందరి ఆదరాభిమానాలు ఉంటాయనే ఆశిస్తున్నానని పంచకర్ల రమేష్ బాబు ముగించారు.