నేరం చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిన పోలీసులు.. తమ అనుకున్న వారిని మాత్రం వదిలేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆర్జీఐఏ ఠాణాలో నకిలీ సర్టిఫికెట్ల దందాలో ప్రమేయమున్న వ్యక్తి పేరు బయటపడకుండా చేసిన వ్యవహారమే ప్రత్యక్ష ఉదాహరణ. నిందితుడు ఒక మహిళా ఎస్సై భర్త కావడమేనన్న ఆరోపణలొస్తున్నాయి.
మూడు నెలల క్రితం శంషాబాద్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి నాగేశ్వరరావు దూరవిద్యలో ఎంఎస్సీ కోర్సు చేసేందుకు తన సహోద్యోగి సాయిబాబును అడిగాడు. వీరిద్దరూ కలిసి ఓ కార్పొరేట్ కళాశాలలో పీఆర్వోగా పనిచేస్తున్న కొత్తపేటకు చెందిన సిద్ధు యాదవ్(36)ను, హయత్‌నగర్‌కు చెందిన బి.శివశంకర్‌రెడ్డి(47)ని, సరూర్‌నగర్‌కు చెందిన బి.దేవేందర్‌రెడ్డి(42)ని కలిశారు. సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ అడ్వాన్సు కింద రూ.40 వేలు తీసుకున్నాడు. జులై తొలివారంలో రెండు ఎంఎస్సీ కెమిస్ట్రీ పట్టాలు ఇచ్చారు. పరీక్షలు రాయకుండానే పత్రాలు ఎలా ఇచ్చారనే అనుమానంతో నాగేశ్వరరావు, సాయిబాబు వాటిని తనిఖీ చేయగా నకిలీవని తేలింది. వారు ఈ నెల 12న ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ మరోవ్యక్తి పేరు చెప్పారు. ఇక్కడే సైబరాబాద్ పరిధిలో పనిచేసే ఓ మహిళా ఎస్సై రంగ ప్రవేశం చేశారు.
ఈ నకిలీ సర్టిఫికెట్ల దందాలో మహిళా ఎస్సై భర్త సైతం మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు మిగిలిన ముగ్గురూ పోలీసుల ముందు అంగీకరించారు. పోలీసులు విచారించేందుకు ప్రయత్నించగా సబ్ ఇన్స్పెక్టర్ ఆర్జీఐఏ పోలీసుల్ని సంప్రదించారు. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భర్త పాత్ర వెలుగులోకి రాకుండా చూడాలంటూ బతిమిలాడినట్లు సమాచారం. కేసు నమోదవ్వకుండా చూడాలంటూ వేడుకోవడంతో పోలీసులు నిందితుని పేరు తొలగించి మిగిలిన ముగ్గురిపైనే కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముగ్గురిని అరెస్టు చేసి స్టేషన్ బెయిలు ఇచ్చి వదిలేశారు.
వాస్తవానికి ఈ కేసులో ఉస్మానియా డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు-38, జేఎన్టీయూ బీటెక్ పట్టాలు- 05, ఆంధ్రా, ఆచార్య నాగార్జున, కృష్ణ దేవరాయ, కాకతీయ, వెంకటేశ్వర యూనివర్సిటీలు, కొలరాడో స్టేట్ ఆఫ్ యూనివర్సిటీ, ఇందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సర్టిఫికెట్లు పట్టుబడ్డాయి. డబ్బులిస్తే అంగట్లో సరకులా ధ్రువీకరణ పత్రాలు విక్రయించే వ్యక్తుల్ని స్టేషన్ బెయిలు ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది.