అనకాపల్లి టౌన్, న్యూస్లీడర్, జూలై 18 : రైతులకు కిసాన్యాత్ర నిర్వహించి, దేశవ్యాప్త ఖ్యాతిని, రైతు బాంధవుడిగా కీర్తిని స్వర్గీయ వీవీ.రమణ పొందారని మున్సిపల్ మాజీ చైర్మన్ మళ్ల సాంబశివరావు అన్నారు. మంగళవారం గవరపాలెం పార్కు సెంటరు దరి వీవీ.రమణ రైతుభారతిలో రైతు బాంధవుడు, మాజీ పార్లమెంటు సభ్యులు వీవీ.రమణ 45వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుభారతిలోని వీవీ.రమణ విగ్రహానికి రమణ కుటుంబసభ్యులు, అభిమానులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ, గవరలను బీసీ‘డీ’ కేటగిరిలోకి తీసుకొచ్చిన ఘనత వీవీ.రమణదేనన్నారు. ఆచార్య ఎన్జీ రంగా, సర్థార్ గౌతులచ్చన్న వంటి ఉద్ధండులకు శిష్యునిగా రైతుల పక్షాన నిలిచిన వీవీ.రమణ, కేవలం 31ఏళ్లకే రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై, పేద బడుగు, బలహీన వర్గాలకు విశేషసేవలు అందించారన్నారు. 15రోజుల్లోనే రైతుల భాగస్వామ్యంతో తుమ్మపాలలో సహకారరంగంలో చక్కెర ఫ్యాక్టరీని ప్రారంభించి, సహకార స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచారన్నారు.
అనకాపల్లి వ్యవసాయదారుల సంఘం ఉపాధ్యక్షులు విల్లూరి పైడారావు మాట్లాడుతూ వీవీ.రమణ మరణించి 45 ఏళ్లు గడిచినా నేటికీ ఇంకా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వివి రమణ మహోన్నత నాయకుడని కొనియాడారు. తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ తరలిపోతున్న సమయంలో రైతుల భాగస్వామ్యంతో సహకార చక్కర ఫ్యాక్టరీని అభివృద్ధి చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. కార్యక్రమంలో విల్లూరి లక్ష్మణరావు, విల్లూరి రాము నాయుడు, విల్లూరి రామచంద్రరావు, విల్లూరి శివసూర్యనారాయణ, నానాజీ, కర్రి దివాకరరావు, విల్లూరి రాము భీశెట్టి కృష్ణ అప్పారావు, విల్లూరి రెడ్డమ్మ నాయుడు, విల్లూరి జగ్గబాబు,కొణతాల కాశీవిశ్వనాథం, వీవీ.రమణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.