ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో ముఖాన్ని మార్చుకొని.. వాట్సప్ వీడియో కాల్ ద్వారా ఓ వ్యక్తిని సైబర్ నేరగాడు మోసం చేసిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. కోజికోడ్‌కు చెందిన రాధాకృష్ణన్‌కు గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సప్ వీడియో కాల్ వచ్చింది. అందులో మాట్లాడుతున్న వ్యక్తి.. ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న తన స్నేహితుడిని పోలి ఉన్నట్లు గుర్తించాడు. కాల్లో మాట్లాడుతూ మోసగాడు.. రాధాకృష్ణన్‌కు తెలిసిన పేర్లను చెప్పాడు. దీంతో అతడు తన స్నేహితుడేనని రాధాకృష్ణన్ భావించాడు. ఆ తర్వాత మోసగాడు.. తాను దుబాయ్‌లో ఉన్నానని, తన బంధువుల చికిత్స కోసం డబ్బులు కావాలని అడిగాడు.
భారత్‌కు రాగానే ఇచ్చేస్తానని, రూ.40,000 ఇవ్వమని కోరాడు. దీంతో రాధాకృష్ణన్ రూ.40వేలు పంపేశాడు. ఆ తర్వాత మళ్లీ అతడు రూ.35 వేలు అడిగాడు. రాధాకృష్ణన్‌కు అనుమానం వచ్చి.. తన స్నేహితుడిని సంప్రదించగా అసలు విషయం బయటపడింది. దీంతో ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేరళ పోలీసుల సైబర్ ఆపరేషన్ విభాగం.. దర్యాప్తు చేపట్టింది. మోసగాడిని గుర్తించి అతడి దగ్గర నుంచి మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకుని రాధాకృష్ణన్‌కు తిరిగి అప్పగించింది.