బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పాము కాటు వేసింది.. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని రొయ్యల చెరువుల సమీపంలో ఆయన పాముకాటుకు గురయ్యారు. వెంటనే చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఆమంచి పాముకాటుకు గురయ్యారన్న సమాచారంతో వైసీపీ వర్గాలు, ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది.. ఆయనకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలపడంతో.. ఊపిరి పీల్చుకున్నారు ఆమంచి కుటుంబ సభ్యులు, అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. మెరుగైన వైద్యం కోసం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ఆమంచి కృష్ణ మోహన్.. 2000లో వేటపాలెం మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికయ్యారు.. 2009లో చీరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. 2014 ఎన్నికల్లో చీరాల నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.. ఇక, 2019 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన పర్చూరు నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్‌గా కొనసాగుతుండగా.. ఆయన సోదరుడు ఆమంచి సాములు.. జనసేన పార్టీలో చేరిన విషయం విదితమే.