ఆ దంపతులది రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. వారికి ఏకైక కూతురు. ఆమెను అల్లారుముద్దుగా పెంచుతూ ఉన్నతంగా చూడాలనుకున్నారు. అమ్మా వెళ్లి వస్తానని చెప్పిన మాటలు చెవిలో ఉండగానే.. మీ అమ్మాయి నీటి గుంతలో పడి చనిపోయిందంటూ తోటి విద్యార్థి చెప్పడంతో జీర్ణించుకోలేకపోయారు. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గాదెలవలస సమీపంలో చోటు చేసుకుంది.
స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం సీతానగరం మండలం బూర్జ పంచాయతీ ఆవాలవలస గ్రామానికి చెందిన ఆవాల సత్యం, పార్వతిల కుమార్తె శ్రావణి(14) గాదెలవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. మంగళవారం పాఠశాలకు సైకిల్‌పై తోటి విద్యార్థులతో బయల్దేరింది. గాదెలవలస సమీపానికి చేరుకునే సరికి మూర్ఛ రావడంతో రహదారి పక్కనున్న నీటి గుంతలో పడింది. ఆమెపై సైకిల్ పడిపోవడంతో మునిగిపోయింది. ముందు వెళ్తున్న విద్యార్థులు గమనించకపోగా వెనుక ఉన్న మరో విద్యార్థి చూసి భయంతో గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు వచ్చి బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సీఐ స్వామినాయుడు, ఎస్సై నీలకంఠం అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రహదారి పక్కన స్థానికులు మట్టిని తవ్వగా ఏర్పడిన గుంతలో.. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నీరు చేరింది. అదే బాలిక పట్ల మృత్యువుగా మారింది. కాగా పాఠశాల విద్యార్థినుల కోసం నాలుగేళ్ల కిందట నిర్మించిన వసతిగృహాన్ని ప్రారంభించి ఉంటే అందులో చేరేదేమోనని, విద్యార్థిని బతికేదేమోనని, అది ప్రారంభించకపోవడంతోనే బాలికలు ప్రమాదాలకు, అఘాయిత్యాలకు గురవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.