భువనేశ్వర్, న్యూస్ లీడర్, జూలై 19: చెన్నై- కోల్‌కతాలను కలిపే ఎన్‌హెచ్-16పై ఓ వంతెన.. రెండు ముక్కలైంది. అందులో ఒక భాగం నేలపైకి ఒరిగిపోయింది. ఈ అనూహ్య ఘటన ఒడిశాలోని జాజ్‌పుర్ జిల్లాలోని రసూల్‌పుర్ వద్ద జరిగింది. వెంటనే పోలీసులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపేసి, వాహనాలను దారి మళ్లించారు. ఎన్‌హెచ్-16పై రసూల్‌పుర్ వద్ద రెండు వంతెనలు నిర్మించారు. భువనేశ్వర్ వైపు వెళ్తున్న ఓ బస్సు మంగళవారం ఉదయం అందులోని ఓ వంతెనను దాటింది. ఈ క్రమంలోనే ఆ వంతెన నిర్మాణంలోని ఓ స్పాన్ పెద్ద శబ్దంతో కిందికి జారిపోయింది. ఇది గుర్తించిన.. ఓ ట్రాక్టర్ డ్రైవర్‌తోపాటు కౌఖాయ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ హోంగార్డు అప్రమత్తమయ్యారు. వెంటనే వంతెన పైకి వాహనాల రాకపోకలను నిలిపేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను దారిమళ్లించారు. ‘భువనేశ్వర్ బస్సు వెళ్లిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ని ఓ వాహనం కూడా వంతెన దాటింది. ఆ తర్వాత వంతెన కూలిపోయింది. దీంతో మేం ఇతర వాహనాలను బ్రిడ్జి పైకి వెళ్లకుండా ఆపేశాం’ అని హోంగార్డు తెలిపారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారుల బృందం సంఘటన స్థలాన్ని పరిశీలించింది. 2008లో నిర్మించిన ఈ బ్రిడ్జి నిర్మాణ వైఫల్యం కారణంగానే కూలిపోయి ఉండొచ్చని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ (చండీఖోల్) జేపీ వర్మ మీడియాకు తెలిపారు.