బిహార్‌లోని బేతియా జిల్లా నౌతన్ పోలీస్‌స్టేషను పరిధిలోని ఓ గ్రామంలో రోజూ రాత్రిపూట ఒకే సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయేది. గత కొంతకాలంగా ఇలా గ్రామం మొత్తం అంధకారంగా మారిపోయి.. ఆ సమయంలో రెండు బైక్‌లు, కరెంట్ మోటార్లు, పలు మేకలు అపహరణకు గురయ్యాయి. అనుమానం వచ్చిన గ్రామస్థులు మాటు వేసి.. అసలు దొంగలను పట్టుకున్నారు.
గ్రామంలోని ఓ యువతి నిర్వాకమిదని తెలిసిపోయింది. ఆమె రోజూ తన ప్రియుణ్ని కలుసుకునేందుకు రాత్రిపూట ట్రాన్స్‌ఫార్మరు వద్దకు వెళ్లి విద్యుత్తు సరఫరాను నిలిపివేసేది. ఇలా ఏకాంతంలో ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్న ప్రేమికులను గ్రామస్థులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువకుడికి కొందరు దేహశుద్ధి కూడా చేశారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అలానే ఈ ప్రేమజంట పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో ‘కరెంటు’ కథ సుఖాంతమైంది.