సియోల్ : కొరియన్ ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పొరుగు దేశం నుంచి ముప్పు పొంచి ఉందన్న ఆందోళనతో అగ్రరాజ్యం అమెరికాతో జట్టుకట్టిన దక్షిణ కొరియా.. క్రమం తప్పకుండా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది. వాషింగ్టన్, సియోల్ మధ్య రక్షణ సహకారం రోజురోజుకూ పెరిగిపోతున్నది. దీంతో కిమ్ కింగ్డమ్ ఉత్తర కొరియా వరుసగా క్షిపణులను ప్రయోగిస్తున్నది. తాజాగా.. బుధవారం తెల్లవారుజామున రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.
జపాన్ సముద్రంలోకి ఈ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడిరచింది. అమెరికా అణు జలాంతర్గామి దక్షిణ కొరియాకు వెళ్లిన నేపథ్యంలో ప్యాంగాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఓ ప్రదేశం నుంచి రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఈ ప్రయోగం జరిగినట్లు యోన్హాప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడిరచింది. దీనిని జపాన్ కోస్టుగార్డు కూడా ధ్రువీకరించినట్లు తెలిపింది. ఇవి ఎలాంటి క్షిపణులు అనే విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. దక్షిణ కొరియాలోని ఓడరేవుకు అణు బాలిస్టిక్ క్షిపణులను పేల్చగల సామర్థ్యం ఉన్న జలాంతర్గామిని అమెరికా తీసుకొచ్చింది. అది వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ప్రయోగాలు జరగడం గమనార్హం. అణు బాలిస్టిక్ క్షిపణులను దక్షిణ కొరియాకు అమెరికా తీసుకురావడం గత నాలుగు దశాబ్దాల్లో ఇదే మొదటిసారి.