బ్రిటన్, న్యూస్ లీడర్, .ఊలై 19 యూకే ప్రధాని రిషి సునాక్ పాపులారిటీ అక్టోబర్ నుంచి చూస్తే అత్యంత కనిష్ఠానికి పడిపోతోందని ఓ పోలింగ్ కంపెనీ సర్వే పేర్కొంది. దీంతో ఆయన నాయకత్వంలో కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో పోరాడి విజయం సాధించడంలో సవాళ్లు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. బ్రిటన్‌లో దాదాపు 65 శాతం మంది ఓటర్లు ఆయనకు ప్రతికూలంగా ఉండగా 25 శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. ‘యూ గవ్ పోల్’ పేరిట నిర్వహించిన సర్వేలో దాదాపు 2,151 మంది బ్రిటన్‌వాసుల అభిప్రాయాలను సేకరించారు. ఆయనపై ఉన్న సానుకూల దృక్పథం దాదాపు 40 శాతం తగ్గిందని కంపెనీ పేర్కొంది. ఇక గత నెలతో పోల్చుకొంటే 6 శాతం తగ్గింది.
ఎన్నికల వేళ…
బ్రిటన్‌లో వచ్చే ఏడాది జనరల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. దీంతో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడం రిషి సునాక్ ఎదుట ఉన్న అతిపెద్ద సవాలు. భారీగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం అధికార పక్షాన్ని భయపెడుతోంది. లక్ష్యిత శాతం కంటే కనీసం నాలుగు రెట్లు అధికంగా నమోదవుతోంది. ఫలితంగా ధరలు పెరిగి ప్రజలకు జీవన వ్యయాలు భారంగా మారాయి. తాజాగా అక్కడ బోరిస్ జాన్సన్, నిగల్ ఆడమ్స్, డేవిడ్ వర్బర్టోన్ రాజీనామాలతో ఖాళీ అయిన మూడు స్థానాల్లో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించడానికి కన్జర్వేటివ్ పార్టీ అవస్థలు పడుతోంది. వీటిల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో పార్టీకి భారీ మెజార్టీ వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఇక్కడి ఎన్నికలను వీలైనంత తక్కువ చేసి చూపేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
పెన్ను వివాదం…
సునాక్‌పై వచ్చే వివాదాలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. గతంలో ఛాన్సలర్‌గా ఉన్న సమయం నుంచి రాసిన దాన్ని తుడిచేసే వీలున్న ‘పైలట్ వి’ పెన్నులను వినియోగించేవారు. ప్రధాని అయిన తర్వాతా అవే పెన్నులను అధికారిక కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్నట్లు విమర్శలొచ్చాయి. ఇటీవల మాల్డోవాలో జరిగిన యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ సమావేశంలో అధికారిక పత్రాలపైనా ఇదే పెన్నుతో సంతకాలు చేయడం కలకలం రేపింది. అయితే ప్రధాని ఎప్పుడూ ఈ పెన్నుతో వాక్యాలను రాసి తుడిచేసే ప్రయత్నం చేయలేదు. భవిష్యత్తులో చేయరు కూడా అని ఆయన కార్యాలయం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. శరణార్థులను రువాండాకు పంపే ప్రణాళికకు కోర్టులో ఎదురుదెబ్బ తగలడం, అలాగే వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు ఆయనపై వ్యతిరేకత పెంచుతున్నట్లు తెలుస్తోంది.