. శ్రీరమణం…మరణం…విచారకరం
(చింతాడ కృష్ణారావు, సీనియర్ జర్నలిస్టు, 80086 79666)
.
శ్రీరమణ ప్రముఖ కథకుడు, వ్యంగ్య వ్యాస రచయిత. సుప్రసిద్ధమైన సినిమా ‘మిథునం’ కథా రచయితగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పత్రికల్లో వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణపరంగా పలు విధాలుగా సాహిత్య, కళా రంగాల్లో ప్రసిద్ధి వహించారు. ఆయన ‘పత్రిక’ అనే మాసపత్రికకు గౌరవ సంపాదకుడిగా ఉన్నారు. ఆయన హాస్య రచన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం 2014 కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు.
గుంటూరు జిల్లా వాసిగా…
గుంటూరు జిల్లా, వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారం గ్రామానికి చెందినవారు. ఇది వేమూరు మండలం తెనాలికి సమీపంలో ఉంది. ఆయన తల్లిదండ్రులు అనసూయ, సుబ్బారావులు. వారి తండ్రి పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. ప్రాథమిక విద్యను స్థానికంగా ఉన్న శ్రీరామ హిందూ ప్రాథమిక పాఠశాలలో పూర్తి చేశారు. ఫస్ట్‌ఫారమ్‌లో అంటే హైస్కూలులో అడుగుపెట్టాలంటే జరిగే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై కవిరాజా జిల్లా పరిషత్ హైస్కూల్, వేమూరులో ఫస్ట్‌ఫారమ్‌లో చేరారు. ఆ పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తి చేశారు. స్కూలు రోజుల్లో రామకృష్ణ మిషన్ ఆశ్రమం ప్రతినిధులు స్వామి వివేకానందునిపై వ్యాస రచన పోటీ నిర్వహించారు. ఆయనకు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇలా వరసగా ఆరేళ్లు ప్రథముడిగా నిలిచారు. పన్నెండేళ్ల వయసులో విజయవాడ ఆకాశవాణి నుంచి యువజనుల కార్యక్రమంలో ఆయన ఇంటర్వ్యూ వచ్చింది. అప్పుడే బాపట్లలో కళాశాల స్థాపించారు. బాపట్ల కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో పి.యు.సి.లో చేరారు. వారి తాతగారికి ఆడపిల్లలే గాని మగ పిల్లలు లేరు. పి.యు.స.ిలో ఉండగా ఆయనను దత్తత చేసుకున్నారు. వారి జన్మనామం ‘వంకమామిడి రాథాకృష్ణ’. దత్తతకు వెళ్ళిన తరువాత ఆ పేరు ‘కామరాజు రామారావు’గా మారిపోయింది. రెండు పేర్లు, రెండు ఇంటిపేర్లు. ఈ తికమక నుంచి బయటపడాలని ఆయన తన పేరును ‘శ్రీరమణ’గా మార్చుకున్నారు.
సాహితీ ప్రస్థానం
సాహితీ ప్రపంచానికి సుపరిచితులైన శ్రీరమణ అనేక ప్రముఖ పత్రికలలో పేరడీలు, శ్రీకాలమ్, శ్రీచానెల్, చిలకల పందిరి, హాస్యజ్యోతి, మొగలిరేకులు వంటి ఎన్నో శీర్షికలు నిర్వహించారు. మిథునం కథ చూసి ముచ్చటపడిన బాపు స్వీయ దస్తూరిలో ఆ కథను రాసి శ్రీరమణకు పంపారు. జంపాల చౌదరి (సాహితీప్రియులు, అమెరికాలో చైల్డ్ సైకియాట్రిస్ట్) ఆ దస్తూరితోనే కథను ప్రచురించి ఇప్పటికి నాలుగు లక్షల మందికి అందజేశారు. మిథునం శ్రీరమణ మనసులో బాల్యం నుంచి నాటుకున్న ఆలోచనలకు అక్షర రూపం. ఇది ఎన్నో సంప్రదాయ కుటుంబాల కథ అని శ్రీరమణ చెబుతుంటారు. తెలుగులో పేరడీ రచయితగా శ్రీరమణ సుప్రసిద్ధులు. అనేకమంది ప్రసిద్ధ రచయితల శైలిని అనుకరిస్తూ పేరడీలు రాసి స్వయంగా ఆయా రచయితల అభినందనలనూ పొందారు. వీరి పుస్తకాలను వసుధేంద్ర, అజయ్ వర్మ అల్లూరి గార్లు కన్నడలోకి, గౌరి కృపానందన్ తమిళంలోకి అనువదించారు.
రచనలివీ…
శ్రీరమణ రచనల్లో ప్రధానమైనవి శ్రీరమణ పేరడీలు, ప్రేమ పల్లకి (నవల), రంగుల రాట్నం (కాలమ్) శ్రీఛానెల్, హాస్య జ్యోతి, నవ్య మొదటి పేజీ, గుత్తొంకాయ్ కూర, మానవ సంబంధాలు, శ్రీకాలమ్, మిథునం (కథా సంపుటి), శ్రీరామాయణం, మహాభారతం (విరాట ఉద్యోగ పర్వాలు), మానవ సంబంధాలు, సరసమ్.కామ్ (5 సంపుటాలు), శ్రీరమణీయం, సింహాచలం సంపెంగ (కథా సంపుటి)
బొమ్మ -బొరుసు (రూరల్ ఎకానమీ కథా కమామిషు).
డికాలమ్స్లో అందెవేసిన చేయి…
ఈయన పలు పత్రికల్లో, వార పత్రికల్లో నడిపిన కాలవమ్స్ ఇలా… రంగుల రాట్నం, జేబులో బొమ్మ, టీ కప్పులో సూర్యుడు,
శ్రీఛానెల్, శ్రీకాలమ్, పూలు పడగలు.
వ్యక్తిగత జీవితం
శ్రీరమణకు అన్నయ్య, అక్క ఉన్నారు. ఆయన వివాహం వారి వదినగారి (అన్నభార్య) చెల్లెలైన జానకితో 1976లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు అబ్బాయిలు. చైత్ర, వంశీకృష్ణ. వారి పిల్లల బాల్యం అంతా బాపు గారింట్లోనే గడిచింది. పెద్ద కుమారుడు బీటెక్ పూర్తిచేసి ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్నాడు. కోడలు శాలిని, ఎంబీఏ చదివారు. మనవడు ఆదిత్య. వంశీకృష్ణ కెమికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్డీ పూర్తిచేసి ఫెలోషిప్‌లో ఉన్నారు.
మిథునం కోసం…
మిథునం 2012లో విడుదలైన తెలుగు చిత్రం. దాదాపు పాతిక సంవత్సరాల క్రితం శ్రీరమణ రచించిన 25 పేజీల మిథునం కథకు తనికెళ్ల భరణి అందించిన చిత్రరూపమే ఈ చిత్రం. అప్పదాసు (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) విశ్రాంత ఉపాధ్యాయుడు. అర్ధాంగి బుచ్చి (లక్ష్మి) తో కలిసి స్వగ్రామంలో నివసిస్తుంటాడు. పిల్లలందరూ విదేశాలలో స్థిరపడటం వలన దంపతులిద్దరూ మాత్రమే శేషజీవితాన్ని గడుపుతూ, జీవితాన్ని విచారంగా గాక ఎంత రమణీయంగా…రసమయంగా మలుచుకుని తమ శేషజీవితాన్ని ఓ మధురానుభూతిగా మిగిల్చారన్నదే స్థూలంగా కథ… ఈ క్రమంలో వీరిద్దరి మధ్యన జరిగే విశేషాల సమాహారమే ఈ చిత్రం. కేవలం రెండు పాత్రలు తప్ప సినిమాలో ఏ పాత్ర కనిపించదు. పద్మభూషణ్ యేసుదాసు ఒక పాట, పాతతరం ప్రముఖ గాయని జమునారాణి ఓ జానపదం గీతం ఈ చిత్రంలో పాడారు. జొన్నవిత్తుల ‘కాఫీ దండకం’ రచించారు. ఈ చిత్రం ఆడియో సి.డి. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో, డల్లాస్‌లో, న్యూజెర్సీలో ప్రవాసాంధ్రుల సమక్షంలో విడుదల చేశారు.
ఆస్కార్ అవార్డుకు నామినేట్
సినిమా ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఇచ్చిన సూచనల మేరకు ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. ఈ చిత్ర నిర్మాతకు ‘మిధునం’ సినిమా ఉత్తమ విదేశీ భాషా సినిమా అవార్డు క్యాటగిరి’ లో నామినేట్ అయింది. నంది పురస్కారం – 2012 నంది పురస్కారాలులో తృతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ మాటల రచయిత (తనికెళ్ళ భరణి), ప్రత్యేక బహుమతులు లక్ష్మి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంలకు వచ్చాయి.