ఢిల్లీ, న్యూస్ లీడర్, జూలై 19: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది మళ్లీ ఉగ్రరూపం దాల్చడం తో ఢిల్లీవాసులు భయోందోళనకు గురవుతున్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడమే ఇందుకు కారణం.
గత కొద్ది రోజులుగా ఈ నదీ ప్రవాహం తగ్గుముఖం పట్టగా.. బుధవారం ఉదయానికి నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయిని దాటింది. ఢిల్లీలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కేంద్ర జల కమిషన్ సమాచారం ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యుమనా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయి (205.33 మీటర్లు)ని దాటి 205.48 మీటర్లుగా నమోదైంది. ఈ సాయంత్రానికి ఇది 205.72 మీటర్లను చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతవారం యమునా నది నీటిమట్టం ఆల్‌టైం గరిష్ఠానికి చేరి 208.66 మీటర్లుగా నమోదవడంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించిన విషయం తెలిసిందే.
వరదల వేళ.. పాముల కలకలం
ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. జులై 22 వరకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. గుజరాత్‌లోనూ రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. గిర్ సోమ్‌నాథ్, కచ్, నవ్‌సరి, వల్సాద్, అమ్రేలీ, రాజ్‌కోట్ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపింది. ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.