అలహాబాద్, న్యూస్ లీడర్, జూలై 19: ట్రైన్ మూడు గంటలకు పైగా ఆలస్యంగా నడవడంతో అందులో ప్రయాణించిన న్యాయమూర్తికి అసౌకర్యం కలిగిందంటూ సంబంధిత రైల్వే అధికారుల నుంచి హైకోర్టు సంజాయిషీ కోరింది. ఈమేరకు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు నార్త్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్‌కు లేఖ రాసింది.
ఈ నెల 8వ తేదీన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతం చౌదరి తన భార్యతో కలిసి పురుషోత్తం ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణించారు. ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్‌కు ఏసీ కోచ్‌లో ట్రావెల్ చేశారు. అయితే, ఈ ట్రైన్ షెడ్యూల్ టైమ్ కన్నా 3 గంటలు ఆలస్యంగా ప్రయాగ్ రాజ్ చేరుకుంది. పైగా ఏసీ కోచ్‌లో ఉండాల్సిన రక్షణ సిబ్బంది కూడా లేరని, టీటీఈకి న్యాయమూర్తి ఎన్నిమార్లు చెప్పినా ఉపయోగం లేకుండా పోయిందని రైల్వే జీఎంకు రాసిన లేఖలో హైకోర్టు రిజిస్త్రార్ పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్యాంట్రీ మేనేజర్ ఫోన్ ఎత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో న్యాయమూర్తికి తీవ్ర అసౌకర్యం కలిగిందని, దీనికి బాధ్యులైన వారిని కోర్టుకు వచ్చి సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించాలని అందులో పేర్కొన్నారు. ఈమేరకు అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ ప్రొటొకాల్ ఆశిష్ కుమార్ శ్రీవాస్తవ జులై 14న నార్త్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్‌కు లేఖ రాశారు.