ఒకే అమ్మాయిని ఇద్దరు స్నేహితులు ప్రేమించారు. తన ప్రేమకు అడ్డువస్తున్నాడనే కోపంతో స్నేహితుడిని అంతమొందించాడు. అదృశ్యమైన యువకుడి కేసు మిస్టరీని పోలీసులు ఒక్క రోజులోనే ఛేదించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది.
శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ రాంచందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరులో నివాసం ఉంటున్న బిహార్ నుంచి వచ్చిన వలస కుటుంబానికి చెందిన రాహుల్‌సింగ్ అలియాస్ అమర్నాథ్ (21), రెండు సంవత్సరాల క్రితం అదే రాష్ట్రం నుంచి వచ్చి తిమ్మాపూర్ హెచ్ఐఎల్ పరిశ్రమలో పనిచేసే రాజ్‌కపిల్ సాహు (20) స్నేహితులు. ఇద్దరూ బిహార్‌కు చెందిన ఒకే యువతిని ప్రేమించారు. ఆ యువతి రాజ్కపిల్తో చనువుగా ఉండటం సహించలేకపోయిన రాహుల్‌సింగ్ హత్యకు పథకం వేశాడు.
కొత్తూరుకు చెందిన పాత నేరస్థుడు మహమ్మద్ తాహేర్ (19), మరో ఇద్దరు మైనర్లతో కలిసి ఈ నెల 18న సాయంత్రం మద్యం తాగేందుకు తిమ్మాపూర్ సమీపంలోని ఓ పాత వెంచర్ వద్దకు రాజ్కపిల్ను తీసుకెళ్లారు. మద్యం తాగిన అనంతరం బీరు సీసాలతో పొడిచి, తలపై బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం అక్కడే మృతదేహంపై కొంత మట్టికప్పి వెళ్లిపోయారు. ఈ నెల 19న హెచ్ఐఎల్ పరిశ్రమ కాంట్రాక్టర్ సోనూకుమార్ రాజ్‌కపిల్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి గదిలో ఉండే సహచరుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాహుల్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని, నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు చెప్పారు.