పార్ట్ టైం ఉద్యోగం పేరిట సైబర్ నేరగాళ్లు గోకవరానికి చెందిన ఓ యువకుడి నుంచి రూ.6.18 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక శివాలయం ఎదుటి వీధిలో నివాసం ఉంటున్న కొవ్వూరి కృష్ణారెడ్డి కుమారుడు హేమంత రామారెడ్డి. ఈ యువకుడు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు.
ఈ యువకుడి వాట్సాప్‌కు పార్ట్‌టైం ఉద్యోగం పేరిట ఒక మెసేజ్ వచ్చింది. వారు పంపించిన లింక్‌పై క్లిక్ చేసి ఇచ్చిన టాస్క్ పూర్తి చేయాలనేది ఆ మెసేజ్ సారాంశం. రామారెడ్డి ఆ లింక్‌పై క్లిక్ చేసి అతని వివరాలను తెలిపాడు. ముందుగా కొంత సొమ్మును డిపాజిట్ చేయాలని చెప్పడంతో వెంటనే రూ.100 డిపాజిట్ చేశాడు. అనంతరం రూ.280 యువకుడి ఖాతాలో వేశారు.
రామారెడ్డి మరో లక్ష రూపాయలు వేయగా రూ.1.30 లక్షలు రానున్నట్లు చూపించారు. ఈ విధంగా రామారెడ్డి తన ఖాతా నుంచి దఫదఫాలుగా రూ.6.18 లక్షల సొమ్ము బదిలీ చేశాడు. అనంతరం వారి నుంచి సమాధానం రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గోకవరం ఎస్సై ఎంవీఆర్ రెడ్డి తెలిపారు.