నకిలీ ఏసీబీ అధికారి అవతారమెత్తిన ఓ యువకుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేసి బెదిరించి, రూ.1.02 కోట్లు వసూలు చేశాడు. ఆ యువకుడిని హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.85 వేల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.2.24 లక్షలు, ఐదు సిమ్‌కార్డులు, 8 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆంధ్రప్రదేశ్‌లో 32, తెలంగాణలో 3 కేసులున్నాయి. అనంతపురం జిల్లా పోలీసుల ‘మోస్ట్ వాంటెడ్’ నేరగాళ్ల జాబితాలో ఉన్నాడు.
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొట్టాలపల్లికి చెందిన నూతేటి జయకృష్ణ(28) బీకాం పూర్తి చేశాడు. జల్సాలకు అలవాటుపడి 2017లో అనంతపురంలో తొలిసారి గొలుసు దొంగతనం చేసి ఐదు రోజులు జైలుకెళ్లాడు. అక్కడ పరిచయమైన అనిల్ ద్వారా.. 2019లో బెంగళూరుకు చెందిన శ్రీనాథ్‌రెడ్డి పరిచయమయ్యాడు. గ్యాంగ్ సినిమాతో ప్రభావితమైన శ్రీనాథ్, జయకృష్ణ అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు నకిలీ ఏసీబీ అధికారుల అవతారమెత్తారు. ఇద్దరూ కలిసి 2019లో నెల్లూరు జిల్లాకు చెందిన రవాణా శాఖ అధికారికి ఫోన్ చేసి డబ్బు వసూలు చేశారు. దాంతో జైలుకెళ్లారు.
విడుదలయ్యాక జయకృష్ణ తన కాలేజీ స్నేహితులు రాఘవేంద్ర, రామచంద్రతో కలిసి అనంతపురంలో 16 గొలుసు దొంగతనాలు చేశాడు. అలా జైలుకెళ్లి అక్కడ పరిచయమైన సాల్మన్‌రాజ్, సాయికుమార్, గంగయ్యతో కలిసి 2019 నుంచి 2022 మధ్య కర్నూలు, కడప, అనంతపురం తదితర జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులకు ఫోన్లు చేసి వసూళ్లు చేశాడు. గతేడాది ఆగస్టు నుంచి తెలంగాణా లోని 15 జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు 200 మందిని బెదిరించి.. రూ.70 లక్షలు వసూలు చేశాడు.
ఫోన్లో మాట్లాడే సమయంలో మిమిక్రీ చేసి ఏసీబీ ఇన్స్పెక్టర్, డీఎస్పీ నంటూ రెండు గొంతులతో మాట్లాడి, అధికారులు హడలిపోయేలా చేసేవాడు. ఇలా వచ్చిన డబ్బుతో గోవా వెళ్లి రోజుకు రూ.లక్షకుపైగా ఖర్చు చేసి క్యాసినోలు ఆడతాడని పోలీసులు తెలిపారు. ఫోన్నంబర్ల ఆధారంగా నిందితుడు బెంగళూరులో ఉంటున్నట్లు గుర్తించారు. ఇటీవల తన పని కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఇదే అదనుగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.