ఇంటర్వ్యూ సాకుతో 24 ఏళ్ల భోజ్‌పురి సినీ నటిపై ఆమె ఇన్స్టాగ్రామ్ స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుర్‌గ్రామ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో భోజ్‌పురి సినిమా ఆర్టిస్ట్‌కు భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. అందులో ఆమె తరుచుగా పోస్టులు చేస్తుంటుంది.
ఈ క్రమంలో మహేశ్ పాండే అనే వ్యక్తి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. అంతేకాకుండా భోజ్‌పురి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని తెలిపాడు. దీంతో గత జూన్ 29న గురుగ్రామ్‌లోని ఉద్యోయ్ విహార్ ఏరియాలో ఇంటర్వ్యూ పేరుతో ఓ హోటల్‌కు పిలిచాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి దిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
‘‘గుర్‌గ్రామ్‌లోని ఓ హోటల్లో మహేశ్ పాండే ఓ గది బుక్ చేశాడు. నేను అక్కడికి చేరుకున్నాక నన్ను కొన్ని ప్రశ్నలు అడిగాడు. అనంతరం అతడు మద్యం తీసకోబోతుండగా నేను అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశాను. దీంతో అతడు బలవంతంగా నన్ను అడ్డగించి నాపై అత్యాచారం చేశాడు. అంతేకాకుండా మహేశ్ పాండే చంపుతానని బెదిరించాడు. నా ప్రైవేట్ వీడియోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తామని అతని స్నేహితుల్లో కొందరు తనకు ఫోన్ చేసి బెదిరించారు‘‘ అని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆర్టిస్ట్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులను వెంటనే అరెస్టు చేస్తామని ఏసీపీ వరుణ్ దహియా పేర్కొన్నారు.