ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో గవర్నర్‌పేటలోని ఓ వ్యాపార సంస్థలోని ఎలక్ట్రానిక్ ప్రైవేటు సెక్యూరిటీ అలారం మోగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు వచ్చారు. సంస్థ షట్టర్ వేసి ఉండటంతో సాంకేతిక లోపం అనుకుని వెళ్లిపోయారు. 18వ తేదీ ఉదయం 9.30 గంటలకు దుకాణ యజమాని కొల్లిపర రాజశేఖర్ వచ్చి చూస్తే.. క్యాష్ కౌంటర్లో రూ.1.04లక్షల నగదు కనిపించలేదు. సీసీ కెమెరా ఫుటేజీ రికార్డు చేసే హార్డ్ డిస్క్‌లు మాయమయ్యాయి. దీనిపై కేసు గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నపాటి క్లూ కూడా లేని చోరీ కేసును వారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. 24 గంటల వ్యవధిలోనే నిందితుడు అజిత్‌సింగ్‌నగర్ ఎక్సెల్ ప్లాంట్ వద్ద ఉండే యలమంచిలి హేమంత్‌కుమార్ (27)గా గుర్తించారు. అతడిపై నిఘా ఉంచి, పట్టుకుని అతని వద్ద నుంచి చోరీ చేసిన మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో అసలు మెలిక ఏంటంటే.. నిందితుడు హేమంత్‌కుమార్ పుట్టు మూగ, చెవిటి. అయినా దొంగతనాలు చేయటంలో దిట్ట. అతడిపై వన్‌టౌన్, భవానీపురం పోలీస్స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నాయి. నిందితుడి పట్టుకున్న వైనాన్ని గురువారం గవర్నర్‌పేట సీఐ సురేష్‌కుమార్ తెలిపారు. ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి సమయంలో హేమంత్‌కుమార్.. గవర్నర్‌పేట, గూడవల్లి వారివీధిలోకి ఓ భవనం పైకి ఎక్కాడు. దానిపై నుంచి కిరణ్ ట్రేడర్స్ భవనం 3వ అంతస్తులోకి వెళ్లాడు. లిఫ్ట్‌లో కిందకు వచ్చి, దుకాణంలోకి ప్రవేశించాడు. దొంగ రాకను ఆధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థ పసికట్టడంతో అలారం మోగింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు వచ్చినా.. షట్టర్ తాళాలు భద్రంగానే ఉండటంతో వెనుదిరిగారు. హేమంత్‌కుమార్.. క్యాష్ కౌంటర్లోని నగదును తీసుకున్నాడు. తిరిగి వెళ్లిపోతూ.. సీసీ టీవీ ఫుటేజీ రికార్డు చేసే హార్డ్‌డిస్క్‌లను తీసుకెళ్లిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నేరం జరిగిన విధానం పరిశీలించారు.
సీసీ టీవీ ఫుటేజీ లేకపోవటంతో.. వేరే విధంగా దర్యాప్తు ప్రారంభించారు. అలారం మోగిన విషయం తెలుసుకున్న పోలీసులు.. అదే సమయంలో ఆ వీధిలోని సీసీ టీవీ ఫుటేజీ ద్వారా రాకపోకల వివరాలు సేకరించారు. హేమంత్‌కుమార్ కదలికలపై అనుమానం రావటంతో.. నిఘా పెట్టి, అరెస్టు చేశారు. చోరీ సొత్తు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని 24 గంటల్లోనే గుర్తించిన సీఐ సురేష్, ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ కాంతిరాణాటాటా అభినందించారు.