ఇంఫాల్, న్యూస్‌లీడర్, జూలై 22: మణిపుర్లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దీనిపై ఆగ్రహజ్వాలలు చెలరేగుతోన్న సమయంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రాంతానికి సరిగ్గా 40 కిలోమీటర్ల దూరంలో అదే రోజున మరో ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్పోక్పీ ప్రాంతంలో ఆ ఇద్దరు యువతులు కార్లు సర్వీస్ చేసే కేంద్రంలో పనిచేస్తున్నారు. వారు పనిలో ఉండగా.. కొందరు వ్యక్తులు వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి వారిని బయటకు లాగిపడేశారని, ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడ్డారని వార్తా కథనాలు పేర్కొన్నాయి. తర్వాత వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారి స్నేహితురాలు ఒకరు మీడియాకు వెల్లడిరచారు. తీవ్రంగా గాయపడిన ఈ ఇద్దరిని పోలీసులు అంబులెన్స్‌లో తరలించిన దృశ్యాలను తాను దూరం నుంచి చూసినట్లు ఆమె తెలిపారు. జాతుల మధ్య వైరంతో రెండునెలలుగా మణిపుర్ రాష్ట్రం భగ్గుమంటోంది. అప్పటి నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లో భాగంగానే మే 4న ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలపై కొందరు వ్యక్తులు క్రూరత్వానికి ఒడిగట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేపింది. సరిగ్గా అదే రోజు ప్రస్తుత ఘటన జరగడం సంచలనంగా మారింది.
వీడియో ఘటనలో ఐదో నిందితుడి అరెస్టు..
అమానుష వీడియో ఘటనలో మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాంతో అరెస్టయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. వైరల్ వీడియోలో కనిపిస్తోన్న వారి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. మణిపుర్ లోయ, పర్వత ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో పోలీసులు 126 చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అలాగే వదంతులను నమ్మొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వాటికి చెక్ పెట్టేలా సరైన సమాచారం తెలుసుకునేలా ఒక హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసింది. పనితీరుతో సహా వివిధ ప్రమాణాల ఆధారంగా కేంద్రం ప్రభుత్వం బెస్ట్ పోలీసు స్టేషన్లను ఎంపిక చేస్తుంది. అలాగే 2020లో నాంగ్‌పోక్ సెక్మాయ్ పోలీస్ స్టేషన్ దేశంలోనే బెస్ట్ స్టేషన్‌గా నిలిచింది. సరిగ్గా దానికి ఒక కిలోమీటర్ పరిధిలోనే మహిళలపై అమానుష ఘటన జరగడం గమనార్హం. ఈ మేరకు ఓ వార్త సంస్థ కథనం వెల్లడిరచింది.