విశాఖలో రోజ్‌గారి మేళా ప్రారంభించి ధృవీకరణ పత్రాలు అందజేసిన కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ 70వేల మందికి అప్పాయింట్మెంట్లు
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 22: దేశంలోని నిరుద్యోగాన్ని రూపుమాపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ అన్నారు. విశాఖలోని పోర్ట్ కళావాణి స్టేడియంలో నిర్వహించిన 7వ ‘రోజ్‌గారి మేళా’లో ఆయన మాట్లాడారు. తొలుత ఢిల్లీలోని ప్రధాని మోడీ శనివారం ప్రారంభోపన్యాసం చేసి, మేళాను ఆన్లైన్లో ప్రారంభించగా విశాఖలో కస్టమ్స్ సహా పలు విభాగాల ఉన్నతాధికారుల సమక్షంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. శనివారం నాటికి 70వేల మందికి ఎస్బీఐ, పోస్టల్, రైల్వే, ఎల్ఐసీ, యూబీఐ, ఎఫ్‌సీఐ, కస్టమ్స్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు కల్పిస్తూ ధృవీకరణ పత్రాలు అందజేశారు. విశాఖలో 35మంది వరకు కేంద్ర మంత్రి సర్టిఫికెట్లు ఇచ్చారు. 10లక్షల మందికి ఉద్యోగాలిప్పించడమే ధ్యేయమన్నారు. ఉద్యోగార్థులతో గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వీరంతా సెప్టెంబర్ 15లోగా ఉద్యోగాల్లో చేరాలన్నారు. చదువు పూర్తి చేసుకుని ఎవరి కాళ్లమీద వాళ్లు నిలబడేలా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లో మళ్లీ రోజ్‌గారి మేళా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కస్టమ్స్ చీఫ్ కమిషనర్ సంజయ్ పంథ్, ఇన్‌కంట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ మితిలేష్ కుమార్ జా తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు పొందిన వారంతా సంతషించారు.