ఢిల్లీ, న్యూస్లీడర్, జూలై 22 : దేశంలోని పలు రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శనివారం వెల్లడిరచింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రంలోని ఘాట్ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ..
వచ్చే ఐదు రోజుల్లో కేరళ, కర్ణాటక, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో కర్ణాటకలోని కోస్తా ప్రాంతాల్లో, దక్షిణ అంతర్గత ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జులై 25న ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఒడిశా రాష్ట్రంలో జులై 25వతేదీన అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయలో జులై 25 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే మూడురోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.
ఆరెంజ్ అలర్ట్ జారీ
ఈ నేపథ్యంలో రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్ రాష్ట్రాల్లో జులై 22 నుంచి 25వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు శనివారం విడుదల చేసిన వెదర్ బులెటిన్లో తెలిపారు.