` భారత్‌లో బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధ ప్రభావం
` బియ్యం కోసం ఎగబడుతున్న జనం
` దుకాణాల ముందు క్యూ..
` పలు దేశాల్లోనూ ఇదే పరిస్థితి
` ఇల్లు కొంటే బియ్యం ఇస్తామంటూ బిల్డర్ల ఆఫర్
అమెరికా, న్యూస్‌లీడర్, జూలై 22 : ఆహార ధాన్యాల కొరత భయం కారణంగా భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన ప్రభావం వివిధ దేశాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా తెలుగు వారు అధికంగా ఉండే అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో బియ్యంకు ఎనలేని డిమాండ్ ఏర్పడిరది. ఆయా దేశాల్లో దుకాణాల ముందు బియ్యం కొనుగోలు కోసం జనం ఎగబడుతున్నారు. సరుకు ఉన్నప్పుడే కొనుక్కొని తమ ఇళ్లకు పట్టుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలోని దుకాణాల్లో బియ్యం అమ్మేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆ దేశంలో బియ్యం కోసం ఎంత డిమాండ్ ఏర్పడిరదంటే.. ఓ బిల్డర్ తన వద్ద ఇల్లు కొంటే సోనామసూరి బియ్యం 15 బ్యాగులు (20 ఎల్బీ చొప్పున) ఆఫర్ చేస్తున్నట్టు బోర్డు ఏర్పాటు చేశాడు. కేవలం బియ్యం కొనేందుకే షాపులకు వస్తున్న జనం ట్రాలీల కొద్దీ బియ్యం ప్యాకెట్లను నింపుకొంటున్నారు. ఇదంతా.. భారత ప్రభుత్వం గురువారం నుంచి బియ్యం (నాన్`బాస్మతి) ఎగుమతులపై నిర్ణయం తీసుకున్న ప్రభావమే. ఆయా దేశాల్లో వరి ఆహారంగా తీసుకునే వారంతా అప్రమత్తం అవుతున్నారు.
నిషేధం ఎందుకు?
ఎన్నో ఏళ్లుగా సుమారు 140 దేశాలకు భారత్ వివిధ రకాలైన ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ దేశాల్లో ఆహార కొరత ఏర్పడినా.. భారత్‌లో మాత్రం ఆ పరిస్థితి కన్పించలేదు. కానీ అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా మన దేశంలోనూ ఆహార ఉత్పత్తి తగ్గుతోంది. ఓ వైపు పెరుగుతున్న ధరలతో ద్రవ్యోల్బణం భయపెడుతోంది. ఈ క్రమంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతియేతర రకాల బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది.
ఈ ఏడాది భారత్‌లో ఆలస్యంగా కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం గురువారం నిషేధం విధించింది. బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై ఈ నిషేధం వర్తిస్తుంది. భారత్‌లో ప్రజలకు వరి బియ్యం ప్రధాన ఆహారధాన్యం కావడంతో దాని ధరలు అడ్డగోలుగా పెరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఇటీవల వానల వల్ల బియ్యం రిటైల్ ధరలు ఒక్క నెలలో 3 శాతం పెరిగాయి. ప్రపంచంలో అతి పెద్ద బియ్యం ఎగుమతిదారు అయిన భారతదేశం తాజా చర్యతో అంతర్జాతీయ ఆహారధాన్యాల మార్కెట్లలో ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా 40 శాతం కన్నా ఎక్కువ ఉంది. వివిధ కారణల వల్ల గత 12 నెలల్లో దేశంలో బియ్యం రిటైల్ ధరలు 11.5 శాతం పెరిగాయి. స్వదేశీ మార్కెట్లో తగినంత మొత్తంలో బాస్మతీయేతర తెల్ల బియ్యం లభ్యమయ్యేలా చూసేందుకు ఎగుమతులపై నిషేధం విధించామని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వివరించింది.
దేశంలో బియ్యం లభ్యతతో పాటు ధరలు అదుపులో ఉంచేందుకు వీలుగా ప్రభుత్వం గత ఏడాది 20 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఉక్రెయిన్ యుద్ధం, ఎల్‌నినో ప్రభావం ఉంటుందనే అంచనాలు, వరి పండిరచే ఇతర దేశాల్లో దిగుబడులు తగ్గవచ్చనే భయాందోళనల కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. 2022లో బియ్యం ఎగుమతుల్లో 74 లక్షల టన్నుల వాటా ఉన్న ఉప్పుడు బియ్యం ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఆహార ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా చూడడానికి ప్రభుత్వాలు తరచు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దేశంలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ.
ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ధాన్యం దిగుబడులు
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. గత నాలుగేళ్లలో వరి దిగుబడులు క్రమేపీ పెరుగుతూనే ఉన్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు రైతన్నలు ప్రగతిపథంలో పయనిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతు భరోసా సహా వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రవేశపెట్టిన అనేక పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రైతుల ఆదాయాలు, కొనుగోలు శక్తి పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఏడాది క్రితం ఆహారధాన్యాల ఉత్పత్తి 154.9 లక్షల టన్నులు ఉండగా, 2023లో వాటి దిగుబడి 169.3 టన్నులకు పెరగింది. సాగు విస్తీర్ణం కొద్దిగా తగ్గినా, ఆహారధాన్యాల ఉత్పత్తి 11 శాతం పెరగడం విశేషం.
ఇక వరి పంట విషయంలో కూడా దిగుబడులు పెరిగాయి. వరి సాగు విస్తీర్ణం రెండు లక్షల హెక్టార్లు తగ్గినా, గత ఏడాది దిగుబడితో (70.17 టన్నులు) పోల్చితే వరి ధాన్యం ఉత్పత్తి 2022-23లో 77.47 లక్షల టన్నులకు పెరిగింది. అంటే.. 10.4 శాతం అభివృద్ధి వరి సాగులో నమోదైంది.
సముచిత నిర్ణయం
` ఎంపీ విజయసాయిరెడ్డి
ప్రస్తుత తరుణంలో ఇది మంచి నిర్ణయం. కొంతకాలంగా దేశంలో బియ్యం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. బాస్మతీయేరత తెల్ల బియ్యం ఎగుమతుల నిషేధంతో ముఖ్యంగా ధరలు అదుపులోకి వస్తాయి. తద్వారా ఇక్కడ ఆహార కొరత సమస్య తలెత్తెక పోవచ్చు. సరైన రీతిలో సమంజసమైన విధంగా భారత ప్రభుత్వం స్పందించింది. అలాగే దేశంలోని ఆయా రాష్ట్రాలు కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంపొందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో గణనీయమైన కృషి చేస్తోంది. అందుకే కొన్నేళ్లుగా ఏపీలో ఆహార ధాన్యాల దిగుబడులు పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సమర్థంగా పని చేస్తున్న రైతు భరోసా కేంద్రాలు, సకాలంలో రుతుపవనాల ఆగమనం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయరంగంపై రాష్ట్ర సర్కారుకు ఉన్న ప్రత్యేక శ్రద్ధ వంటి అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహార ధాన్యాల దిగుబడులు నిరంతరం పెరగడానికి దోహదం చేస్తున్నాయి. పొరుగు తెలుగు రాష్ట్రంలో మాదిరిగా అతి బలమైన పారిశ్రామిక పునాది లేకున్నా, వ్యవసాయరంగం ఏపీ ఆర్థిక వ్యవస్థను క్రమం తప్పకుండా ముందుకు నడిపిస్తోంది.