` జగన్ పాలనలో అన్ని వర్గాలకు మోసం
` ఆయా వర్గాలు, ప్రజలు ప్రభుత్వం కేసు పెట్టాలి
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 22 : ప్రభుత్వం పరువు పోయేంతగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఏం మాట్లాడారని ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం పరువు నష్టం కేసు వేసిందని విశాఖ ఉత్తరం నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. అసలు గడచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏం పరువు మిగాల్చారని ఆయన ట్విటర్ వేదికగా నిలదీశారు. రాష్ట్రానికి రాజధాని లేక, పరిశ్రమలు రాక రాష్ట్రం కుదుళ్లయిందని, అందుకు మీపై వేయాలి పరువు నష్టం దావా అని విమర్శించారు. ప్రత్యేక హోదా తెస్తామంటూ డాంభికాలు పలకడమే తప్ప తెచ్చింది లేదని ఎద్దేవా చేశారు. సంపూర్ణ మద్యం నిషేధం అని చెప్పి మహిళలకు మోసగించారన్నారు. ఆడపడుచులకు ఆ విధంగా మోసగించాలరని, వారంతా జగన్ ప్రభుత్వంపై పరువు నష్టం కేసు వేయాలన్నారు. మార్గదర్శి విషయంలో రాజకీయ కక్షలకు పోయి పరువు పోగొట్టుకున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3 వేల ఫించను ఇస్తామంటూ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ అని ఆ మాట మరిచారు. ఆటోరిక్షా కార్మికుల నుంచి రూ.వేలాది జరిమానాలు వసూలు చేయడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నించారు. ఇసుకను వ్యాపారం కోసం ఉపయోగిస్తూ లక్షలాది భవన కార్మికుల పొట్టకొట్టడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. ఇక పోలవరం నిర్మాణానికి అతీగతీ లేకుండా పోయిందని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కళకళలాడుతుంటూ ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పడకేసిందని గంటా విమర్శించారు. బటన్ నొక్కడమే తప్ప ‘అమ్మఒడి’ డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియదు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణపై పోరాటమే లేదు. రైల్వే జోన్ కోసం పోరు మాటే లేదు. ఉద్యోగులకు ఒకటో తేదీని జీతాలు ఇవ్వలేని దుస్థితి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఇలా.. రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసినందుకు ఆయా వర్గాలు, ప్రజలు మీపై వేయాలి పరువు నష్టం కేసు అని గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు.