విశాఖకు రెండు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లపై హర్షం
ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 26: విశాఖకు రెండు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు బీసీసీసీ ప్రతిష్టాత్మకంగా కేటాయించడంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా నవంబరు 23న భారత్-ఆస్ట్రేలియా మధ్య అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌తోపాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండు నుంచి ఆరు వరకు భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్‌కు విశాఖ ఆతిథ్యమివ్వనున్న సందర్భంగా బీసీసీఐకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నగరంలో ఓ హోటల్లో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు దేశంలో పర్యటించనున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల టూర్లకు సంబంధించిన షెడ్యూల్, మ్యాచ్‌ల వేదికలను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించిన విషయం తెలిసిందేనని అన్నారు. టీమిండియా విశాఖలో రెండోసారి ఆస్ట్రేలియాతో టీ 20, ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడనుందన్నారు. విశాఖ వేదికగా 19 సంవత్సరాల్లో 17 మ్యాచ్‌లు జరిగాయి, గతంలో జరిగిన నాలుగు మ్యూచ్లతోపాటు జరగనున్న రెండు మ్యాచ్‌ల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కీలక పాత్ర వహించిందన్నారు. రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు విశాఖకు కేటాయించడంపై బీసీసీఐ కార్యదర్శి జై షాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రకటన ఎంతో ఉత్సాహంగా ఉందని, విశాఖ ఒక బ్రాండ్‌గా అభివృద్ధి చెందడానికి ఈ రెండు మ్యాచ్‌లు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విశాఖకు క్రికెట్‌పై ఉన్న ప్రేమను గుర్తించి రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు బీసీసీఐ కేటాయించడం చాలా సంతోషంగా వుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శరత్ చంద్రా రెడ్డి తెలియజేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లు కన్నా మరింత పకడ్భందీగా మ్యాచ్‌లు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆంధ్రాలో అన్ని ఫార్మాట్స్‌లో డొమెస్టిక్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నామని, విశాఖతో పాటు విజయనగరం, విజయవాడ, కడప జిల్లాలో కొత్త స్టేడియం ఏర్పాట్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏసీఏ తరుపున ప్రతిపాదానలు పంపామన్నారు. అంతేకాకుండా క్రికెట్ అకాడమీలో స్పెషల్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నామని, 20 మంది ఎమెర్జింగ్ క్రీడాకారులను గుర్తించామని, త్వరలో వాటి వివరాలు తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి ఏ.వి.చలం, సీఎఫ్‌వో నవీన్, లీగల్ మేనేజర్ నాగేశ్వరరావు, జీఎం ఎం.ఎస్.కుమార్ పాల్గొన్నారు.