.సమస్యలు ఎదుర్కొంటున్నామంటూ 10 మంది ఎమ్మెల్యేల లేఖ . సీఎం సిద్దరామయ్యను అడ్రస్ చేస్తూ . ఆ లేఖలు ఫేక్వంటూ ఖండిచిన డీకే
బెంగళూరు, న్యూస్ లీడర్, జూలై 26: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాసిన లేఖలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యేలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు ఉన్న ఆ లెటర్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. జిల్లాల ఇన్చార్జి మంత్రులు ఎమ్మెల్యేల వినతులకు స్పందించడం లేదని… నియోజకవర్గాలకు కేటాయించిన నిధులను విడుదల చేయడం లేదని లేఖలో ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఫండ్స్ రిలీజ్ చేయిస్తామంటూ మధ్యవర్తులు రంగంలోకి దిగారని, కమీషన్ ఇస్తే నిధులను విడుదల చేయిస్తామంటున్నారని చెప్పారు. ఈ లేఖపై 10 మంది ఎమ్మెల్యేల సంతకాలున్నాయి. ఈ 10 మందిలో ఉన్న ఒక ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… ఈ లేఖ తమ వ్యక్తిగతమైనదని, గురువారం సీఎల్పీలో దీనిపై చర్చిస్తామని చెప్పారు. అయితే, ఈ లేఖ మీడియాకు లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ లేఖపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ… ఇది ఫేక్ లెటర్ అని కొట్టిపారేశారు. ఇంకోవైపు లెటర్లో పేరు ఉన్న మరో ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ స్పందిస్తూ… ఈ లేఖ నిజం కాదని అన్నారు. ఇది బీజేపీ కొత్త నాటకంలో భాగమని ఆరోపించారు. ఇది తన లెటర్ హెడ్ అని… అయితే లెటర్ హెడ్ పై తాను సీరియల్ నెంబర్లు వేస్తుంటానని, అందువల్ల అవి మిస్ యూజ్ కాకుండా ఉంటాయని చెప్పారు. ఇప్పుడు తన పేరుతో బయటకు వచ్చిన లెటర్ హెడ్ పై సీరియల్ నెంబర్ లేదని తెలిపారు.