` నగరానికి మరో భారీ షాపింగ్ మాల్
` కే రహేజా గ్రూప్ నిర్మాణం
` 17 ఎకరాల్లో ఏర్పాటు
` రూ.600 కోట్ల పెట్టుబడి
` మూడేళ్లలో నిర్మాణానికి ప్రణాళిక
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 26 : ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా మారబోతోన్న సాగర నగరం విశాఖపట్నంలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాబోతోంది. ఇప్పటికే రూ.14,500 కోట్లతో అదాని డేటా సెంటర్ ఇక్కడ రూపుదిద్దుకుంటోంది. కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇక తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ ఇనార్బిట్ మాల్ ఈ నగరంలో ఏర్పాటు కానుంది. దేశీయ పారిశ్రామిక దిగ్గజం కే రహేజా గ్రూప్ దీన్ని నిర్మించబోతోంది. మొత్తం 17 ఎకరాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్‌ను నిర్మిస్తారు. దీనికి సంబంధించి ప్రాథమిక ఒప్పందాలు ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరలోనే మాల్ నిర్మాణ పనులను రహేజా సంస్థ మొదలు పెట్టనుంది.
సాలిగ్రామపురంలో ఆర్బిట్ మాల్..
విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సాలిగ్రామపురంలో కే రహేజా గ్రూప్ ఈ ఇనార్బిట్ మాల్‌ను నిర్మించనున్నది. విశాఖ పోర్ట్‌కు చెందిన గెస్ట్‌హౌస్ స్థలంలో దీన్ని నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. శిథిలావస్థకు చేరుకున్న విశాఖ పోర్ట్ గెస్ట్‌హౌస్ స్థలాన్ని 30 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. దీనికోసం రూ.125 కోట్లు వైజాగ్ పోర్ట్‌కు చెల్లించింది. ఈ భారీ మాల్‌ను మూడేళ్ల వ్యవధిలో నిర్మించే అవకాశాలు ఉన్నాయి.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇనార్బిట్ మాల్స్ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, మలద్, వసై, నవీ ముంబై, వడోదర.. తదితర నగరాల్లో ఇవి నిర్మితం అయ్యాయి. ఇక తాజాగా విశాఖపట్నం కూడా ఈ జాబితాలో చేరనుంది.
ఆగస్టు 1న సీఎంతో శంకుస్థాపన
ఈ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్‌కు వైఎస్ జగన్ ఆగస్టు 1వ తేదీన శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. సాలిగ్రామపురంలో దీని నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.
ఇటీవల కే రహేజా సంస్థ చీఫ్ నీల్ రహేజా.. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన విషయం తెలిసిందే. మాల్ శంకుస్థాపనకు రావాలంటూ ఆహ్వానించారు. విశాఖలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్‌ను నిర్మించబోతోన్నామని, కోసం మూడేళ్లలో 600 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటైతే విశాఖపట్నం నగరానికి మరో భారీ షాపింగ్ మాల్ నగర వాసులకు అందుబాటులోకి వస్తుంది.