. అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, కెనడాల్లోనూ…
. బియ్యం ఎగుమతులపై బ్యాన్ ఎత్తేయాలి
. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రతినిధుల విజ్ఞప్తి
. ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న బియ్యం ధరలు
ఢిల్లీ, న్యూస్ లీడర్, జూలై 26: బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర సర్కార్ చర్యలు ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లోనూ సంక్షోభం నెలకొంది. ఇటీవల బియ్యం కోసం విదేశాల్లో భారతీయులు క్యూ కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా బియ్యం కొనుగోళ్లు విపరీతంగా పుంజుకున్నాయి. నెలలో కొనే బియ్యానికి రెట్టింపు పరిమాణంలో భారతీయులు బియ్యం కొనుగోలు చేస్తున్నారని ఆస్ట్రేలియాలోని దుకాణ దారులు చెబుతున్నారు.
విదేశాల్లో నల్లబజారు…
బాస్మతీయేతర రకాల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిల్వ చేసుకునేందుకు విదేశాల్లోని భారతీయులు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో దాన్ని నియంత్రించేందుకు వ్యక్తికి 5 కిలోల బియ్యం మాత్రమే అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. చాలామంది భారతీయులు తమ నిర్ణయం పట్ల తిరగబడుతున్నారని, అయినప్పటికీ తాము ఒకరికి 5 కిలోలకు మించి అమ్మడంలేదని అక్కడి విక్రయదారులు వాపోతున్నారు.
అందుకే పరిమితులొద్దు…
మరోవైపు బియ్యం ఎగుమతులపై పరిమితులను తొలగించాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ కొరత ప్రపంచ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో నిర్దిష్ట రకం బియ్యం ఎగుమతిపై పరిమితులను తొలగించాలని భారతదేశాన్ని కోరుతున్నామని పేర్కొంది. ప్రస్తుత వాతావరణంలో ఈ రకమైన పరిమితులు ప్రపంచంలోని ఇతర దేశాలలో ఆహార ధరలపై అస్థిరతను పెంచే అవకాశం ఉంది. అంతేకాదు ఇది ప్రతీకార చర్యలకు కూడా దారితీస్తాయని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ పియర్-ఒలివర్ గౌరించాస్ మీడియాతో అన్నారు. అటు ఈ నిషేధం కారణంగా అమెరికాలోని ఇండియన్ స్టోర్లలో పరిమితులు కొనసాగుతున్నాయి. దాదాపు స్టోర్లన్నీ ఖాళీ. టెక్సాస్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక కుటుంబానికి ఒక బ్యాగ్‌ను మాత్రమే అనే బోర్డులు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేశం నుండి ఎగుమతి అయ్యే మొత్తం బియ్యంలో ఈ రకం బియ్యం 25 శాతం ఎగుమతి అవుతాయి. భారతదేశం నుండి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులు 2022-23లో 4.2 మిలియన్ల డాలర్లు కాగా, అంతకుముందు సంవత్సరంలో 2.62 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇండియా నుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతయ్యే దేశాల్లో ప్రధానంగా అమెరికా, థాయిలాండ్, ఇటలీ, స్పెయిన్ శ్రీలంక ఉన్నాయి.
ఆంక్షలు ఇలా…
ఈ నెల 20న కేంద్ర ప్రభుత్వం రైస్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. నాన్ బాస్మతి రైస్ ఎగుమతులపై బ్యాన్ విధించింది. దేశీయ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, బాస్మతి రైస్, పారాబాయిల్డ్ రైస్ లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. వైట్ రైస్ ను అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, థాయ్ లాండ్, ఇటలీ, స్పెయిన్, శ్రీలంక తదితర దేశాలకు ఇండియా ఎగుమతి చేస్తోంది. భారత ప్రభుత్వ నిర్ణయంతో అమెరికాలో బియ్యం కోసం డిపార్ట్ మెంట్ స్టోర్ల ముందు జనం బారులు తీరారు. బియ్యం బస్తాలను అర్జెంటుగా కొని తీసుకెళ్లేందుకు క్యూ కట్టారు. దీంతో డిపార్ట్ మెంట్ స్టోర్లలో తాత్కాలికంగా రైస్‌కు కొరత ఏర్పడిరది.