. స్టేషన్లో ఆగకుండా వెళ్లిపోయిన రైలు
. గార్డు గమనించి లోకో పైలట్‌కు సమాచారం
. కిలోమీటరు దూరంలో నిలిపిన రైలు
. రైల్వే స్టేషన్ మాస్టర్‌కి కొత్త… అందుకే
దోని పట్టణం, న్యూస్ లీడర్, జూలై 26: స్టేషన్లో రైలు ఆగకపోవడంతో ప్రయాణికులు పరుగులు పెట్టిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్లో మంగళవారం చోటుచేసుకుంది. ముంబయి నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వారాంతపు రైలు (22179) కర్నూలు జిల్లా ఆదోనికి ప్రతి మంగళవారం తెల్లవారు జామున 1.40 గంటలకు చేరుకుంటుంది. ఆదోని మీదుగా చెన్నై, కడప, రేణిగుంట, తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు మంగళవారం స్టేషన్‌కు చేరుకున్నారు. రైలు ఐదు గంటలు ఆలస్యంగా ఉదయం 6.40 గంటలకు ఆదోనికి వచ్చింది. కానీ బండి వస్తున్న సమయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్లాట్‌ఫాంపై నిలిచే బోగీల సంఖ్యను కూడా సూచించలేదు. ప్రయాణికులు చూస్తుండగానే బండి స్టేషన్లో ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో ప్రయాణికులు కేకలు వేస్తూ.. రైలు వెంట పరుగులు తీశారు. గార్డు అప్రమత్తమై లోకో పైలట్‌కు సమాచారం ఇవ్వడంతో స్టేషన్ నుంచి కి.మీ.దూరం వెళ్లి నిలిచింది. కొందరు ప్రయాణికులు అక్కడికి వెళ్లి గార్డుతో వాగ్వాదానికి దిగారు. స్టేషన్ మాస్టర్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో రైలు ఆపలేదని గార్డు ప్రయాణికులకు వివరించారు. ఈ విషయంపై ఆదోని స్టేషన్ మేనేజర్ వెంకటేశులును వివరణ కోరగా ఈ నెల మొదటి వారం వరకు ఈ రైలు ఆదోని స్టేషన్లో ఆగేది కాదన్నారు. ఇటీవల ఆగుతున్న విషయం కొత్తగా బాధ్యతలు చేపట్టిన స్టేషన్ మాస్టర్‌కు తెలియకపోవడంతో సిగ్నల్ ఇవ్వలేదని వివరించారు.