శ్రీహరింపురం, జులై 27( న్యూస్ లీడర్ ) ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేస్తున్న నకిలీ నేవీ ఉద్యోగిని గురువారం మల్కాపురం పోలీసులు అరెస్టు చేశారు. సింధియా వద్ద నున్న ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ జోన్ -2 ఆనంద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం……నగరంలోని ఈస్ట్ పాయింట్ కాలనీ సమృద్ధి అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న గాడి సత్య సూర్య చలపతిరావు అలియాస్ శశికాంత్ అనే వ్యక్తి గత 10 సంవత్సరాల నుంచి తాను నేవీలో కమాండర్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నానని నమ్మించి నిరుద్యోగులకు వలవేసి,ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి వారి వద్ద నుంచి లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నాడు. నిరుద్యోగులను చీటింగ్ చేస్తూ ఎంతో మందిని మోసం చేసాడు.అదేవిధంగా ఈ నెల 26తేదీన ఐ ఎన్ ఎస్ కళ్యాణి హాస్పిటల్ దగ్గర అగ్నిపత్ స్కీమ్ లో అగ్ని వీర్ సెలెక్షన్ రీ మెడికల్ అవుతున్నందున అక్కడికి వెళ్లి నిరుద్యోగులను కలిసి వారి వద్ద నుంచి డబ్బులు గుంజుదామానే దురుద్దేశంతో అక్కడికి చేరాడు. నావెల్ క్యాంటీన్లో కమాండర్ డ్రెస్ లో ఉన్నటువంటి గాడి సత్య సూర్య చలపతిరావుని నావల్ అధికారులు గమనించి మల్కాపురం ఇన్స్పెక్టర్ కు తెలియపర్చారు. వెంటనే మల్కాపురం సి ఐ జీడి బాబు సిబ్బందితో వెళ్లి చలపతి రావు ను పట్టుకున్నారు. అతని వద్ద నావీ ఆఫీసర్ గా చలామణి అయ్యేందుకు వాడిన వస్తువాలన్నిటినీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మల్కాపురం ఇన్స్పెక్టర్ జి డి బాబు ముద్దాయిని విచారించారు. చలపతి రావు ఇంతకు ముందు కూడా ఇటువంటి నేరాలు చేసి జైలు కి వెళ్లినట్టు వెల్లడించారు. ఈ కేసును ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయవలసి ఉందని పోలీసులు తెలిపారు. డీసీపీ జోన్-2 ఆనంద రెడ్డి పర్యవేక్షణలో హార్బర్ ఏసీపీ మోసెస్ పాల్ గైడెన్స్ లో మల్కాపురం ఇన్స్పెక్టర్ జి డి బాబు, వారి సిబ్బంది కేసును దర్యాప్తు చేస్తున్నారు.