సినిమాటోగ్రాఫ్ బిల్లుపై చర్చలో విజయసాయి రెడ్డి సూచన
న్యూఢిల్లీ, జూలై 27: చలన చిత్ర రంగంలో హీరోలకు చెల్లించే పారితోషకాలు కోట్లలో ఉంటే చిత్ర నిర్మాణం కోసం వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికుల వేతనాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ పరిస్థితులలో మార్పు తీసుకువచ్చి సినీ కార్మికుల కష్టానికి తగిన ఫలితం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు వి. విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. రాజ్యసభలో గురువారం సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని సవరించేందుకు ప్రవేశపెట్టిన బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన ఈ సూచన చేశారు. భారతీయ చలన చిత్ర రంగంలో వివిధ విభాగాల్లో రెండు లక్షల మందికిపైగా కార్మికులు పని చేస్తున్నారు. కాని చిత్ర నిర్మాణం వ్యయంలో మూడోవంతు బడ్జెట్ హీరోలు ఇతర అగ్రనటుల పారితోషకాలకే సరిపోతున్నాయి. ఉదాహరణకు టాప్ హీరో సల్మాన్ ఖాన్‌తో 400 కోట్ల వ్యయంతో నిర్మించే బాలీవుడ్ చిత్రంలో ఆయన పారితోషకమే 250 కోట్లని తెలుస్తోంది. అదిపోగా మిగిలిన బడ్జెట్‌తోనే చిత్ర నిర్మాణం పూర్తి చేయాలి. చిత్ర నిర్మాణంలో రేయింబవళ్ళు కష్టపడే కార్మికులకు వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు. నిర్మాణ వ్యయంలో సింహభాగం పారితోషకం తీసుకుంటున్న హీరోలే నిజమైన లబ్దిదారులవుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి సభలో సినిమాటోగ్రఫి మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు సూచించారు. అలాగే భారతీయ చిత్రపరిశ్రమను ఒక్కసారి పరిశీలిస్తే హీరోల కుమారులే హీరోలు అవుతున్నారు. కాని హీరోల కుమార్తెలు మాత్రం హీరోయిన్లు అవుతున్న ఉదంతాలు చాలా తక్కువ కనిపిస్తాయని అన్నారు. హీరోలు అయ్యే హీరోల కుమారులకంటే అందగాళ్ళయిన అబ్బాయిలు దేశంలో లెక్కకు మించి ఉన్న వారికి హీరోగా అవకాశాలు ఎందుకు దక్కడం లేదో అర్ధం కావడం లేదని అన్నారు.
భారత దేశ జనాభా 140 కోట్లతో చైనాను దాటి పోయింది. చైనాలో 80 వేల థియేటర్లు ఉంటే భారత్‌లో మాత్రం 8 వేల థియేటర్లు మాత్రమే ఉన్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. సినిమా అనేది సామాన్యుడికి చౌకగా లభించే వినోదం. దీనిని సామాన్యులందరికి అందుబాటులోకి తీసుకురావడానికి దేశంలో థియేటర్ల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రభుత్వం నుంచి కూడా తగిన ప్రోత్సాహం ఉండాలని ఆయన అన్నారు. ఒక చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని విజయవంతంగా సెన్సార్ సర్టిఫికెట్ పొందినదంటే ఆ చిత్ర లేదా దర్శకుడికి కేసుల నుంచి పూర్తిగా రక్షణ కల్పించినట్లే పరిగణించాలి. సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ పొందిన చిత్ర నిర్మాత లేదా దర్శకుడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు దాఖలు కాకుండా నిరోధించేలా సినిమాటోగ్రాఫ్ చట్టంలో సవరణ చేయాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.